న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహన విక్రయాలు సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహంగా ఉండటం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, మరోవైపు వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉండటంతో కార్ల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణికి మొగ్గుచూపవచ్చునని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన విక్రయాలు 4-6 శాతం మధ్యలో నమోదుకావచ్చునని పేర్కొంది. మొత్తం ఇండస్ట్రీ మాత్రం 7-9 శాతం మధ్యలో నమోదు చేసుకోవచ్చునని పేర్కొంది. పండుగ డిమాండ్, జీఎస్టీ రేట్లు తగ్గించడం, నూతన మాడళ్లు అందుబాటులోకి రావడం ఇందుకు కారణమని పేర్కొంది.
దేశీయ ఆటోమొబైల్ రంగంలో సంస్థాగత మార్పుల దిశగా అడుగులు వేస్తున్నదని, మొత్తం విక్రయాల్లో యూస్డ్ వాహనాల వాటా 67 శాతంగా ఉండటంతో మొత్తం సేల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని వెల్లడించింది. మరోవైపు, సీఎన్జీ, విద్యుత్‌తో నడిచే వాహనాలకు ఇటీవలకాలంలో డిమాండ్ పెరిగిందని సర్వే సంస్థ విశ్లేషించింది. మరోవైపు, ట్రాక్టర్ ఇండస్ట్రీ 1-4 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నట్టు ఇక్రా అంచనావేస్తున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 23 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకున్న ట్రాక్టర్ల ఇండస్ట్రీ ఈసారి సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నట్టు పేర్కొంది. సాధారణ వర్షాలు కురియడం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితేనే ఇది సాధ్యమవుతున్నదని పేర్కొంది.
బజాజ్ ఆటో వాహన విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. మార్చి నెలకుగాను 4,45,377 యూనిట్ల వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3,69,823తో పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించింది. వీటిలో దేశీయంగా 2,66,290 వాహనాల అమ్మకాలు జరిపింది. అలాగే 2,21,021 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 21 శాతం ఎగబాకి 1,59,452 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే కమర్షియల్ వాహన విక్రయాలు 54,091 యూనిట్ల నుంచి 64,904 యూనిట్లకు చేరుకోగా, వీటిలో 45,260 యూనిట్లను దేశీయంగా విక్రయించగా, 19635 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.