న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్‌లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి రేటు 7.5 శాతానికి పెరిగింది. కోర్ ఇండస్ట్రీస్ వృద్ధి రేటు సెప్టెంబర్‌లో 4.5 శాతం, గత ఏడాది అక్టోబర్ మైనస్ 0.5 శాతంగా ఉంది. ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎనిమిది కీలక పరిశ్రమల సమ్మిళిత సూచీ గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 7.5 శాతం పెరుగుదలతో 136.2కి ఎగబాకింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన అధికారిక ప్రకటన పేర్కొంది.