OpenAI – AI Agents | టెక్నాలజీ రంగంలో పలు మార్పులు తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్షణాల్లో జవాబులిస్తూ యూజర్లను ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నది. ఓపెన్ ఏఐ (Open AI) అనే స్టార్టప్ సంస్థతోపాటు పలు సంస్థలు తెచ్చిన చాట్బోట్లు సంచలనం సృష్టించాయి. మరింత మెరుగ్గా ఈ సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ (Open AI) ఈ ‘ఏఐ ఏజెంట్ల’ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నదని వార్తలొస్తున్నాయి. ఈ ‘ఏఐ ఏజెంట్ల’ రాకతో మన పనులు మరింత సులభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కంప్యూటర్ సిస్టమ్ లోని టాస్క్‌లు వేగంగా పూర్తి చేయడానికి త్వరితగతిన ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి తేవడానికి ఓపెన్ ఏఐ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పలు రీసెర్చ్ ప్రాజెక్టులపై పని చేస్తున్నట్లు సమాచారం. డెవలపర్లకు రీసెర్చ్ ప్రీవ్యూగా ఏఐ ఏజెంట్లను ఓపెన్ ఏఐ వచ్చే జనవరికల్లా అందుబాటులోకి తేనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కువగా ఏఐ ఏజెంట్స్ పేరు వినిపిస్తోంది. ఏఐ చాట్ బోట్ వంటివే ఏఐ ఏజెంట్స్ అనే భావన చాలా మందిలో ఉంది కానీ.. ఏఐ చాట్ బోట్స్.. ఏఐ ఏజెంట్స్ విభిన్నం. ఏఐ చాట్ బోట్ కేవలం యూజర్ల ప్రశ్నలకే స్పందిస్తుంది తప్ప.. తన పరిధి దాటి ముందుకెళ్లలేదు.
కానీ ఏఐ ఏజెంట్ ప్రశ్నల ఉద్దేశం.. సందర్భాన్ని అర్థం చేసుకుని స్వేచ్చగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం సాయంతో మెరుగ్గా ప్రతిస్పందిస్తుంది. కంప్యూటర్లలో పనులు పూర్తి చేయగల ఏఐ ఏజెంట్లను ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిందని సమాచారం. ఏఐ ఏజెంట్లు కోట్ రాసి, టికెట్ బుకింగ్ వంటి క్లిష్టమైన పనులు తేలిగ్గా పూర్తి చేస్తాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తెస్తామని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చెప్పారు.