ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. దాని వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఉత్సుకత చూపుతున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి పెరుగుతున్నది. ఈ తరుణంలో చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ.. యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ అందుబాటులోకి తేవడానికి ప్లాన్ చేసింది. వచ్చే వారంలో ఆండ్రాయిడ్ ఆధారిత చాట్‌జీపీటీ యాప్ ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. గత మే నెలలో ఓఐఎస్ యూజర్లకు యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూజర్లు ముందస్తుగా యాప్ కోసం ‘ప్రీ-ఆర్డర్’ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్’లో ప్రత్యేకంగా పేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ ట్వీట్ చేసింది. యాప్ సిద్ధం కాగానే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్ స్టాల్ చేసుకోవచ్చునని తెలిసింది. వాటర్ మార్కింగ్ కంటెంట్ వంటి అంశాలపై పారదర్శకతతోపాటు సేఫ్టీ విస్త్రుతానికి ఓపెన్ ఏఐ చర్యలు చేపట్టింది. ఏఐ నుంచి తప్పుడు సమాచారం వస్తున్నదన్న ఆందోళనల నేపథ్యంలో యాప్ తయారీని పూర్తిగా సునిశితంగా తనిఖీ చేస్తున్నది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ఆవిష్కరణ ద్వారా మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌తో నేరుగా ఓపెన్ ఏఐ పోటీ పడుతుంది. ఓపెన్ ఏఐ జీపీటీ-4 టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
యూరోపియన్ యూనియన్, బ్రెజిల్‌లలో గూగుల్ తన బార్డ్ చాట్ బోట్ ఆవిష్కరించగా, ఆంట్రోపిక్ తన క్లాడ్-2 చాట్ బోట్ తీసుకొచ్చిన తర్వాత చాట్‌జీపీటీకి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీపై ఆండ్రాయిడ్ యూజర్లకు యాప్ అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు.