Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా భారత్ మార్కెట్లో రూ. లక్ష లోపు ధరకే మూడు విద్యుత్ స్కూటర్లు ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘కస్టమర్ డే’ పేరుతో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు తెచ్చింది. ఓలా ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే ఏడాది చివరిలోగా నాలుగు ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మంగళవారం ప్రకటించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ మోడ్ల్లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఈ మోటారు సైకిళ్లు డిజైన్ చేస్తున్నది. అంతే కాదు ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించింది. 2024లో దశల వారీగా మోటారు సైకిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఎస్1 ఎక్స్ విద్యుత్ స్కూటర్.. రెండు కిలోవాట్ల బ్యాటరీ / మూడు కిలోవాట్ల బ్యాటరీ వేరియంట్, ఓలా ఎస్1 ఎక్స్ + అనే స్కూటర్లు ఆవిష్కరించింది. దీంతోపాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎస్1 ప్రో సెకండ్ జనరేషన్ స్కూటర్ కూడా లాంచ్ చేసింది.
ఎస్1ఎక్స్ స్కూటర్ ధర రూ.79,999 (ఎక్స్ షోరూమ్), ఎస్1ఎక్స్+ స్కూటర్ ధర రూ.99,999లకు లభిస్తుంది. ఈ ధరలు ఈ నెల 21 వరకే వర్తిస్తాయి. ఈ నెల 22 తర్వాత ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ ధర రూ.89,999, ఎస్1ఎక్స్+ ధర రూ.99,999 నుంచి రూ.1,09,999లకే పెంచుతున్నట్లు తెలిపింది. ఎస్1 ప్రో సెకండ్ జనరేషన్ స్కూటర్ ధర రూ.1.47 లక్షలు కాగా, ఎస్1 ఎయిర్ స్కూటర్ రూ.1.19 లక్షలకే లభిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.