Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. అందుకోసం దేశవ్యాప్తంగా హైపర్ సర్వీస్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానుల నుంచి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఓలా ఎలక్ట్రిక్ ‘సర్వీస్ క్యాంపెయిన్’ పేరుతో సొంత సర్వీస్ సెంటర్లు వెయ్యికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 500 ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. హైపర్ సర్వీస్ క్యాంపెయిన్లో భాగంగా డిసెంబర్ కల్లా వాటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నది. మరోవైపు, నెట్ వర్క్ ప్రోగ్రామ్ కింద లక్ష మంది థర్డ్ పార్టీ మెకానిక్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, వాటి మరమ్మతులకు ప్రతి మెకానిక్ సిద్ధం కావాలన్న ఆలోచనతోనే తామీ నిర్ణయం తీసుకున్నామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
వచ్చేనెల 10 నుంచి దశలవారీగా ‘క్విక్ సర్వీస్ గ్యారంటీ’ అమలు చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. అందులో భాగంగా ఒక రోజు కంటే ఎక్కువగా బైక్ లేదా స్కూటర్ సర్వీసింగ్ టైం పడితే.. కస్టమర్ల వెసులుబాటు కోసం ఓలా ఎస్1 స్కూటర్ ఇవ్వనున్నది. దీంతోపాటు ఓలా కేర్+ సబ్ స్క్రైబర్లు ఉచితంగా ఓలా క్యాబ్ కూపన్లు పొందొచ్చునని పేర్కొంది. ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ఎండీ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘దేశంలో మాకు 800 సేల్స్ స్టోర్లు ఉన్నాయి. కానీ 500 సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైపర్ సర్వీస్ క్యాంపెయిన్లో భాగంగా మా నెట్ వర్క్ విస్తరణతోపాటు ఏఐ పవర్డ్ సర్వీస్ సాయంతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తాం’ అని చెప్పారు.