న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఆఫీస్ స్పేస్‌కు ఆదరణ కరువైంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ గతంతో పోల్చితే 24 శాతం పడిపోయింది. నికర లీజింగ్ 11.51 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధిలో 15.08 మిలియన్ చదరపు అడుగులుగా ఉండటం గమనార్హం. అంతేగాక మార్కెట్లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చే కార్యాలయ స్థలాలు కూడా మునుపటితో చూస్తే ఈ 3 నెలల్లో 18 శాతం క్షీణించినట్టు తమ తాజా నివేదికలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తెలిపింది.
నూతన ఆఫీస్ స్పేస్ 8.8 మిలియన్ చదరపు అడుగుల మేరకే సిద్ధమైంది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌పై సర్వే జరిగింది. కాగా, కార్పొరేట్లు తమ వ్యాపార విస్తరణలో నెమ్మదిగా ముందుకు వెళ్లి ఉండవచ్చని, అందుకే డిమాండ్ నిరాశాజనకంగా ఉన్నదని ఈ సందర్భంగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ పరిస్థితుల్ని విశ్లేషించింది. పశ్చిమాసియా సంక్షోభం, గత ఏడాది ఆఖర్లో పెద్ద ఎత్తున జరిగిన లీజింగ్ కూడా ఇందుకు కారణమేనన్నది. ఇక మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ మందగమనం చోటుచేసుకున్నదని చెప్పింది.
దేశంలోని మిగతా నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మాత్రం ఆఫీస్ స్పేస్‌కు విపరీతమైన డిమాండే. అయితే ఇది ఒకప్పటి మాటగానే మిగిలిందిప్పుడు. అవును.. గతకొంత కాలంగా హైదరాబాద్ రియల్టీలోనూ మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయి మరి. మునుపటికి భిన్నంగా దేశీయ మార్కెట్లోని ప్రతికూల ప్రభావం ఇక్కడా కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు నిర్మాణ రంగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి మరి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొన్న భయాలూ ఇందుకు కారణమేనని అంటున్నారు.