న్యూఢిల్లీ, జూన్ 14: రిటైల్ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ మార్గంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులే ఉత్తమమని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చీఫ్ ఆశిశ్‌కుమార్ చౌహాన్ సూచించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్, అంతకుముందు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మదాబీ పురి బచ్.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ రిస్క్‌తో కూడుకున్నదని చేసిన ప్రకటనల నేపథ్యంలో చౌహాన్ కూడా పైవిధంగా స్పందించారు. ‘ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కు రిటైల్ మదుపరులు దూరంగా ఉండాలి.
అందులో ఉన్న రిస్క్‌పై అవగాహన ఉన్నవారే, నష్టాలు వాటిల్లితే భరించేవారే ఆ ట్రేడింగ్‌కు వెళ్లాలి’ అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చౌహాన్ శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. కాగా, లాభాలు, ట్రేడింగ్ వాల్యూమ్స్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌పైనే దృష్టి పెడుతున్నారు. అయితే రిస్క్ ఎక్కువని నిపుణులు సూచిస్తున్నా రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎఫ్అండ్వోల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం నష్టపోయారని సెబీ చెప్తున్నది. 2021-22లో నష్టాల సగటు రూ.1.1 లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నది. 2018-19తో పోల్చితే 2020-21 నాటికి ఎఫ్అండ్వోల్లో ఇండివీడ్యువల్ ట్రేడర్ల సంఖ్య 7.1 లక్షల నుంచి ఏకంగా 45.24 లక్షలకు పెరిగింది. ఇక ఈ ఏడాది మార్చిలో ఎఫ్‌అండ్‌వో నెలవారీ టర్నోవర్ రూ.8,740 లక్షల కోట్లుగా నమోదైంది. 2019 మార్చిలో ఇది కేవలం రూ.217 లక్షల కోట్లే. అలాగే ఈక్విటీల్లో రోజువారీ టర్నోవర్ సగటున లక్ష కోట్ల రూపాయలే. ఎఫ్అండ్వోల్లో మాత్రం ఇది దాదాపు రూ.330 లక్షల కోట్లుగా ఉంటున్నది.