హనుమకొండ, మార్చి 23 : ఎన్పీడీసీఎల్కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ‘గవర్నెన్స్ నౌ 12వ పీఎస్యూ అవార్డు- 2026’ ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు అవార్డు దక్కిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ తరఫున కంపెనీ సెక్రటరీ కే వెంకటేశం ఈ అవార్డును అందుకొని, సోమవారం హనుమకొండ విద్యుత్ భవన్లో సీఎండీకి అందజేశారు.
ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు, ఏఐ ఆధారిత ఫీడర్ అవుటేజ్ అంచనా మాడల్, రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల వినియోగం సంస్థ పనితీరును మెరుగుపరిచినట్లు తెలిపారు. అదనంగా ఇప్పాయి పవర్ అవార్డ్స్- 2026లో ఇన్నోవేషన్ విభాగంలో ఎన్పీడీసీఎల్కు పురసారం లభించిందని తెలిపారు. సంస్థ పరిధిలోని 17 జిల్లాల్లో 72 లక్షల సర్వీసులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, మొబైల్ యాప్ వంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.