UPI | ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత ఆన్లైన్ లావాదేవీలు జరిపే వారికి అలెర్ట్. ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడమే లక్ష్యంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐలో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను తొలగించబోతున్నది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఇప్పటి వరకు, స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు పొందే సందర్భంలో, మనం వారికి ‘కలెక్ట్ రిక్వెస్ట్’ పంపే వీలుండేది. ఇది ఒక రిమైండర్‌లా పనిచేస్తుంది. కానీ, అదే ఫీచర్‌ను సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామంటూ నటిస్తూ.. నకిలీ పేర్లతో మనీ రిక్వెస్ట్స్ పంపిస్తున్నారు. చాలామంది ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి యూపీఐ పిన్ని ఎంటర్ చేయడం ద్వారా తమ డబ్బులను కోల్పోతున్నారు.
గతంలో ఈ తరహా రిక్వెస్ట్‌లకు రూ.2వేల పరిమితిని ఎన్పీసీఐ విధించినా మోసాలు ఏమాత్రం ఆగడం లేదు. దాంతో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. జూలై 29న విడుదల చేసిన తాజా సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఇకపై అక్టోబర్ ఒకటి తర్వాత ఎవరికైనా డబ్బులు పంపాలంటే.. మీరు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే క్యూఆర్ కోడ్‌నైనా స్కాన్ చేయాల్సింది. కలెక్ట్ రిక్వెస్ట్ వంటి ఆప్షన్ అందుబాటులో ఉండదు. దాంతో యూజర్లకు భద్రత ఉంటుందని ఎన్సీపీఐ భావిస్తున్నది. అయితే, ఈ రూల్‌ని వ్యక్తిగత యూజర్ల మధ్య లావాదేవీలకే పరిమితం కాగా.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సీటీసీ వంటి వ్యాపార సంస్థలు మాత్రం యధావిధిగా మనీ రిక్వెస్ట్‌లు పంపించవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్‌ను ఆమోదించి, తమ యూపీఐ పిన్ను ఎంటర్ చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.