Swiggy eye on Metro | నష్టాల్లో చిక్కుకున్న మెట్రో క్యాష్ & క్యారీ సంస్థను టేకోవర్ చేసేందుకు ఫుడ్ డెలివరీ జెయింట్ స్విగ్గీ ప్రయత్నిస్తున్నది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ అనుబంధ మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థకు భారత్‌లో 31 స్టోర్లు ఉన్నాయి. మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థను సొంతం చేసుకుంటే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ మోడల్ బలోపేతం అవుతుందని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
నష్టాలతో సతమతం అవుతున్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థను పూర్తిగా మూసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీన్ని టేకోవర్ చేయడానికి దాదాపు పది దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. 1.5 బిలియన్ల డాలర్ల నుంచి 1.7 బిలియన్ల డాలర్ల ధరకు టేకోవర్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.
మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌తోపాటు అమెజాన్, రిలయన్స్ రిటైల్, అవెన్యూ సూపర్ మార్కెట్, థాయిలాండ్‌కు చెందిన చారోయెన్ పోక్ఫాండ్ (సీపీ) గ్రూప్, తదితర సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆర్వోసీ ఫైలింగ్స్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ నికర నష్టం రూ.23.33 కోట్లు కాగా, అదే ఏడాది టర్నోవర్ రూ.6,915.3 కోట్లు.