US Student Visa | మీరు అమెరికాలో ఎంఎస్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు అమెరికా శుభవార్త అందించింది. కోర్సు ప్రారంభం కావడానికి ఒక ఏడాది ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపింది. గత నెల 26 నుంచి నూతన పాలసీ అమల్లోకి వచ్చిందని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు రెండు రకాల వీసాలు ఎఫ్, ఎం అనే పేరుతో జారీ చేస్తారు. ఒక నూతన విద్యార్థులకు 365 రోజుల ముందే ఈ ఎఫ్, ఎం వీసాలు జారీ చేస్తామని ఇండియాలో అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇంతకుముందు నాలుగు నెలల ముందు మాత్రమే ఈ ఎఫ్, ఎం వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ఏడాది ముందు వీసా జారీ అయినా కోర్సుల ప్రారంభం కావడానికి ముందు 30 రోజుల కంటే ఎక్కువ అమెరికాలో విదేశీ విద్యార్థులు బస చేయడానికి నిబంధనలు అనుమతించవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంటే విదేశీ విద్యార్థి విద్యాసంస్థలో తన కోర్సు ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే ‘బీ’ వీసా కింద అమెరికాలో ఎంటర్ కావడానికి అనుమతి ఇస్తారు.
ఆయా విద్యా సంస్థలు జారీ చేసే ఐ-20 ఫామ్ ఆధారంగా ఆయా దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు సంబంధిత విద్యార్థులకు వీసాలు జారీ చేస్తుంటాయి. భార్యలు, మైనర్లు అమెరికాలో విద్యార్థితో కలిసి జీవించాలనుకుంటే వారికి సంబంధిత విద్యాసంస్థ వేర్వేరుగా ఐ-20 ఫామ్ జారీ చేయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులంతా తప్పనిసరిగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ సిస్టమ్ (సెవిస్) కింద తమ పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
అమెరికా విదేశాంగశాఖ తాజా నిర్ణయం ప్రకారం ఆయా విద్యా సంస్థలు సంబంధిత కోర్సులు ప్రారంభం కావడానికి 12-14 నెలల ముందే ఐ-20 ఫామ్స్ జారీ చేస్తాయి. ఇంతకుముందు వీసా ఇంటర్వ్యూలో 120 రోజుల ముందు ఉండేవి. విద్యా సంస్థలు కోర్సులు ప్రారంభం కావడానికి 120 నుంచి 180 రోజుల ముందు ఐ-20 ఫామ్స్ జారీ చేసేవి. తమ దేశంలో విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయులు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా వీసా సర్వీసుల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. భారత్కు గతేడాది స్టూడెంట్ వీసాల జారీలో రికార్డులు బ్రేక్ అయ్యాయని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తామన్నారు. అమెరికాలో విద్యాభ్యాసానికి వస్తున్న విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉంటారు.
తొలిసారి అమెరికాకు వచ్చే భారతీయులు వీసా అప్లికేషన్ల అప్రూవల్ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తున్నదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తున్నది. గతేడాది అక్టోబర్లో బీ1, బీ2 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు దాదాపు మూడేండ్లు వెయిట్ చేయాల్సి వస్తున్నది. కరోనా ఆంక్షలు ఎత్తేసిన తర్వాత అమెరికా వీసా దరఖాస్తులు ఎక్కువ నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.
ఈ ఏడాది వేసవిలో ఎక్కువ వీసా స్లాట్లు జారీ చేస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రతి రెండు నెలలకోసారి శుక్రవారం వీసా దరఖాస్తుదారుల సందేహాల నివృత్తి కోసం సోషల్ మీడియాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, వీసా దరఖాస్తు దారులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చింది. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీ కన్నా ముందే వీసా ఫీజు రశీదు పొందిన దరఖాస్తు దారులకు వచ్చే సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించామని తెలిపింది.
ఇక ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్-బ్లాంకెట్ ఎల్, ఎమ్, ఓ, పీ, క్యూ, అకడమిక్ జే వీసాల గడువు ముగిసిన 48 నెలల్లోపు వాటి రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం ఇక రాయబార కార్యాలయాలకు లభిస్తుంది. గతంలో వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు పొంది, వీసా తిరస్కరణకు గురైన వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది.