Richest cricketer : ప్రపంచంలో సంపన్న క్రికెటర్ ఎవరంటే ఎవరైనా ఏం చెప్తారు..? టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్ పేరునో.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరునో.. లేదంటే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ పేరునో, అదికాకపోతే దేశవిదేశాలకు చెందిన మరో దిగ్గజ క్రికెటర్ పేరునో చెబుతారు. కానీ వీరికంటే ధనవంతుడైన క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను కూడా భారత్‌కు చెందిన యువ క్రికెటరే. ఇంతకూ ఎవరా క్రికెటర్ అని ఆలోచిస్తున్నారా..?
ఒక యువ క్రికెటర్ దిగ్గజ క్రికెటర్ల కంటే ఎక్కువగా ఎలా సంపాదించాడని మీకు అనుమానంగా ఉంది కదా..! అయితే ఆ సంపద ఆ యువ క్రికెటర్ స్వార్జితం కాదు. పుట్టుకతోనే అతను రిచ్ కిడ్. అతని తండ్రి ఒక దిగ్గజ వ్యాపారవేత్త. అతనికి తండ్రి నుంచి వారసత్వంగా ఆ సంపద సంక్రమించింది. ఆ యువ క్రికెటరే ఆర్యమన్ విక్రమ్ బిర్లా. బడా బిజినెస్ టైకూన్ కుమార మంగళం బిర్లా కుమారుడు.
1997 జూలై 9న ముంబైలో జన్మించిన ఆర్యమన్ బిర్లాకు క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అందుకే చిన్నప్పటి నుంచే క్రికెట్ కోచింగ్ తీసుకుని 2017-18లో మధ్యప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఆర్యమన్ లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్యమన్ బిర్లా 414 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
ఆర్యమన్ బిర్లా 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే ఆర్యమన్ క్రికెట్‌కు దూరమయ్యాడు. బిజినెస్‌లో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీకి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. కంపెనీ పనుల్లో బిజీగా కావడంతో ప్రస్తుతం క్రికెట్‌ను దూరం పెట్టాడు.
ఈ క్రమంలో తాజాగా ‘హురున్’ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతుల జాబితాలో కుమార్ మంగళం బిర్లాకు చోటు దక్కింది. దాంతో ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆరో స్థానంలో ఉన్న కుమార మంగళం బిర్లా 2.35 లక్షల కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. అందులో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైనే ఉందట.