Shedule `FA` in ITR | మీరు విదేశీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో మదుపు చేసినా.. విదేశీ స్టాక్ ఎక్స్చేంజీలో స్టాక్స్ కొనుగోలు చేసినా.. విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినా.. ప్రతియేటా మీరు సబ్మిట్ చేసే ఐటీ రిటర్న్స్‌లో ఆ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే.. అలా చేయలేదా.. భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారు నల్లధనం చట్టం-2015 కింద శిక్షార్హులు కూడా అని చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతియేటా సమర్పించే ఐటీ రిటర్న్స్‌లో షెడ్యూల్ `ఫారిన్ అసెట్స్ (ఎఫ్ఏ)` సెక్షన్ పూర్తిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై నమోదైన ఓ కేసును విచారించిన ముంబై ఇన్‌కం టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో ఆస్తుల కొనుగోళ్లు, షేర్ల కొనుగోళ్ల వివరాలు వెల్లడించనందుకు ప్రతియేటా రూ.10 లక్షల చొప్పున పెనాల్టీ విధిస్తూ తీర్పు చెప్పింది.
బ్లాక్‌మనీ చట్టం-2015లోని 43 సెక్షన్ ప్రకారం విదేశాల్లో పెట్టుబడుల మదుపుపై `ఐటీఆర్`లో షెడ్యూల్ ఏఫ్ఏ సెక్షన్లో పూర్తిగా వివరాలు నమోదు చేయాలని చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. సంబంధిత పన్ను మదింపు అధికారికి సమాచారం ఇవ్వడంలో విఫలమైనా.. సంబంధిత ఇన్వెస్టర్‌కు రూ.10 లక్షల పెనాల్టీ విధించవచ్చునని టాక్స్‌మాన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. విదేశాల్లో `వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)` కొనుగోలు చేసినా, విదేశీ వాలెట్లలో నిధులు డిపాజిట్ చేసినా.. `వీడీఏ` షెడ్యూల్, `ఎఫ్ఏ` షెడ్యూల్లో పేర్కొనాల్సిందేనని బాంబే చార్టర్డ్ అకౌంటెంట్ సొసైటీ (బీసీఏఎస్) ఉపాధ్యక్షుడు ఆనంద్ భాటియా తెలిపారు. విదేశాల్లోని నివసిస్తున్న వారు భారత సంతతి పథకం కింద అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని మ్యూచువల్ ఫండ్స్ కింద పెట్టిన పెట్టుబడుల వివరాలను `ఎఫ్ఏ` షెడ్యూల్లో చేర్చనవసరం లేదన్నారు.
ఐటీఆర్‌లో విదేశీ ఆస్తుల వివరాలు తెలుపని ట్యాక్స్ పేయర్‌పై నల్లధనం చట్టం, ఆదాయం పన్ను చట్టం కింద చర్య తీసుకునే అధికారం ఆదాయం పన్ను విభాగం అధికారులకు ఉంటుంది. పన్ను ఎగవేతకు పాల్పడే ఉద్దేశం లేదని, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని, పొరపాటునే `ఎఫ్ఏ` షెడ్యూల్లో వెల్లడించలేదని రుజువు చేసుకుంటే పెనాల్టీ విధించకపోవచ్చునని చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఒక వ్యక్తికి ఒకటి, అంతకంటే ఎక్కువ ఖాతాల్లో, సంస్థల్లో రూ.5 లక్షల్లోపు పెట్టుబడులు, డిపాజిట్లు ఉన్నా నల్లధనం చట్టంలోని 43 సెక్షన్ ప్రకారం పెనాల్టీ వర్తించదు. కానీ ఐటీఆర్‌లోని షెడ్యూల్ `ఎఫ్ఏ`లో రికార్డు చేయకుంటే చట్ట ప్రకారం అధికారులు చర్య తీసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.