EV Car sales | కర్బన ఉద్గారాల నియంత్రణకు వివిధ దేశాలు ప్రస్తుతం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నార్వేలో గతేడాది జరిగిన కార్ల సేల్స్‌లో మూడింట రెండొంతులు.. అంటే 65 శాతం ఎలక్ట్రిక్ కార్లే. వాటిల్లో గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా.. అత్యధిక కార్ల విక్రయ బ్రాండ్‌గా నిలిచింది. పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లకు చరమ గీతం పాడాలన్న లక్ష్యంతో నార్వే ముందుకు సాగుతున్నది. నార్వే జనాభా 54 లక్షలు. అత్యధిక నిష్పత్తిలో విద్యుత్ కార్లు వాడుతున్న దేశంగా నార్వే నిలిచింది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్‌గా చైనా ఉంది.
ముడిచమురు ఉత్పాదక దేశం నార్వే ప్రభుత్వం.. జీరో ఎమిషన్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకోసం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్స్ (ఐసీఈ)లపై పన్నుల మినహాయింపు ఇస్తున్నది. ఈ నిర్ణయంతో దేశంలో ఈ ఏడాది చివరికల్లా విద్యుత్ కార్ల వినియోగ నిష్పత్తి 80 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2025 నాటికల్లా దేశంలో పెట్రోల్, డీజిల్ కార్ల వాడకానికి చరమ గీతం పాడాలని నార్వే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
2021లో కార్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. మొత్తం 1,76,276 కార్లలో 65 శాతం పూర్తిగా విద్యుత్ ఇంధన వినియోగ కార్లే. 2020లో విద్యుత్ కార్ల మార్కెట్ వాటా 54 శాతం. చైనాకు చెందిన నియో, స్వీడిష్ వోల్వో అనుబంధ పొల్స్టార్ వంటి నూతన బీఈవీ కార్లకు నార్వే కీలక మార్కెట్‌గా ఉంది. 20221 కార్ల మార్కెట్లో టెస్లా కార్ల వాటా 11.6 శాతం, జర్మనీ ఫోక్స్ వ్యాగన్ కార్లు 9.6 శాతం అని నార్వేయన్ రోడ్ ఫెడరేషన్ (ఎన్ఆర్ ఎఫ్) తెలిపింది.
11.6 శాతం అమ్ముడైన టెస్లా బ్రాండ్ కార్లలో మోడల్-3 అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా నిలిచింది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్‌తో కూడిన బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అమ్ముడైన కార్లలో టయోటా హైబ్రీడ్ రవ్4, ఫోక్స్ వ్యాగన్ ఎలక్ట్రిక్ ఐడీ.4 తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.
ఈ ఏడాది సప్లయ్ చైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా నార్వేలో కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్లు 80 శాతం సేల్ అవుతాయని నార్వేజియన్ ఈవీ అసోసియేషన్ అధిపతి చిరిస్టినా బూ చెప్పారు. పోల్‌స్టార్ సీఈవో థామస్ ఇన్గేలాత్.. నార్వే వాసులు ఆల్టర్నేటివ్ వెహికల్‌గా ఎలక్ట్రిక్ కార్లను ఆహ్వానిస్తున్నారని రాయిటార్స్‌కు చెప్పారు. పోల్‌స్టార్ లగ్జరీ సెడాన్.. గతేడాది అమ్ముడైన టాప్-10 కార్లలో ఒకటిగా ఉంది. ఈ ఏడాది పోల్‌స్టార్-3 ఎస్యూవీ కారును ఆవిష్కరించనున్నది.