ముంబై, అక్టోబర్ 11: టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా నోయల్ టాటా నియమితులయ్యారు. రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయల్ టాటా..టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్‌గా ఎంపికయ్యారు. 67 ఏండ్ల వయస్సు కలిగిన నోయల్ టాటా సరైన వ్యక్తి అని టాటా సన్స్ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం నోయల్..టాటా గ్రూపునకు చెందిన రిటైల్ బిజినెస్‌ను చూసుకుంటున్నారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి మరణించిన విషయం తెలిసిందే.
దీంతో టాటా గ్రూపు కొత్త చైర్మన్ ఎవర్ని ఎంపిక చేసేదానిపై శుక్రవారం ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బోర్డు ఏకగ్రీవంగా నోయల్‌ను ఎంపిక చేసింది. ఆయన నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నోయల్ టాటా మాట్లాడుతూ..టాటా గ్రూపు వ్యవస్థాపకుల వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నానని, శతాబ్దం క్రితం ప్రారంభమైన టాటా గ్రూపు అంచలంచెలుగా ఎదుగుతూ లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నదన్నారు. ఇంతటి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించడంతోపాటు దాతృత్వ కార్యక్రమాలకు భంగం వాటిళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.