హైదరాబాద్, మార్చి 1: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ ఆశాజనక పనితీరు కనబరిచింది. ఫిబ్రవరి నెలలో సంస్థ 4.62 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 3.98 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తైన ఖనిజంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని కనబరిచినట్లు కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఖనిజాన్ని ఉత్పత్తి చేయడం కూడా కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ 40.49 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 40.20 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది. వచ్చే ఏడాది నూతన గనులు అందుబాటులోకి వస్తుండటంతో ఖనిజ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు.