Makoto Uchida | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా రాజీనామా చేశారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉచిడా స్థానంలో ప్రస్తుతం కంపెనీ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉన్న ఇవాన్ ఎస్పినోసా కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని నిస్సాన్ పేర్కొంది. ఉచిడా కంపెనీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. నిన్సాన్ జనరల్ షేర్ హోల్డర్ల సమావేశం వరకు పదవిలో కొనసాగుతారు. గత నెలలో హోండా మోటార్ కంపెనీతో జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలను ఉచిడా నిలిపివేశారు.
ఈ నిర్ణయం తర్వాత భవిష్యత్ గురించి ఊహాగానాలున్నాయి. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీలైన హోండా, నిస్సాన్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. విలీనానికి తమ వ్యాపారాలను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గత ఫిబ్రవరిలో కంపెనీలు ప్రకటించాయి. విలీన చర్చలపై ఇక ముందుకు వెళ్లకూడదని బోర్డులు నిర్ణయించాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఒకటి అవతరించబోతోందన్న అంచనాలకు బ్రేక్ పడినట్లయ్యింది. ప్రపంచ వాహన మార్కెట్లో పెరిగిన పోటీని తట్టుకునేందుకు మూడు కంపెనీలు ఏకమవ్వాలని భావించామని.. ప్రస్తుత చర్చలు సాగుతున్న తీరు మాత్రం నిస్సాన్ సత్తాను పూర్తి స్థాయిలో రాబట్టలేదని.. నిస్సాన్‌ను హోండా అనుబంధ విభాగంగా మార్చే ప్రతిపాదనకు ఒప్పకోమని ఉచిడా పేర్కొన్నారు.
అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇతర పరిశోధన ప్రాజెక్టులపై రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిస్సాన్ 80 బిలియన్ యెన్ (సుమారు 540 మిలియన్ డాలర్లు) నష్టాన్ని అంచనా వేసింది. ఇక సీఈవో రాకతో నిస్సాన్ వ్యూహంలో మార్పులు ఉండవచ్చని.. కొత్త నాయకత్వంలో ఆర్థికంగా మెరుగైన పనితీరు కనబరుస్తుందని.. మార్కెట్లో తన స్థానం బలోపేతమవుతుందని కంపెనీ అంచనా వేస్తున్నది.