న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎంజీ మోటర్ భారత్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చలు జరిపింది. తొలి ప్లాంట్ ఉన్న గుజరాత్‌తో కూడా చర్చలు జరిపినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రస్తుత హలోల్ ప్లాంట్ కెపాసిటీని వచ్చే ఏడాది చివరినాటికి 1.25 లక్షల యూనిట్లకు పెంచుకోనుండగా, ఏడాదికి 1.75 లక్షల యూనిట్లు ఉత్పత్తి అయ్యే రెండో ప్లాంట్‌ను నిర్మించబోతున్నది. దీంతో మొత్తం కెపాసిటీ 3 లక్షల యూనిట్లకు చేరుకోనున్నదని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో జరుపుతున్న చర్చలు వచ్చే రెండు నెలలకొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటునకు సంబంధించి అవసరమైన నిధులను అంతర్గత, ఎఫ్‌డీఐ, ఈసీబీలతోపాటు ఇతర పెట్టుబడిదారుల నుంచి సేకరించనున్నట్లు ఆయన ప్రకటించారు.