Income Tax | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయం పన్ను విధానంలో న్యూ ఇన్‌కం టాక్స్ శ్లాబ్‌లు ప్రకటించారు. రూ.12 లక్షల (వేతన జీవులు రూ.12.75 లక్షలు) వరకూ ఆదాయం కల వారు రూ.60 వేల వరకూ పన్ను రిబేట్ పొందొచ్చు. పాత ఆదాయం పన్ను విధానంలో మూడు శ్లాబ్‌లు – 5%, 20%, 30% ఉన్నాయి. వేతన జీవులు, పన్ను చెల్లింపు దారుల స్థూల పన్నుఆధారిత ఆదాయం నుంచి పెట్టుబడులు, పన్ను ఆదా పథకాలతో మినహాయింపులు పొందొచ్చు. ఆ మినహాయింపులు పొందిన తర్వాతే పాత ఆదాయం పన్ను శ్లాబ్‌లు వర్తిస్తాయి.
పెట్టుబడులు, పొదుపు పథకాలను ఆదాయం పన్ను నుంచి డీలింక్ చేయడానికి సుదీర్ఘ కాలంగా ఆర్థిక మంత్రిత్వశాఖ అనుకూలంగా ఉంది. పాత ఆదాయం పన్ను విధానంలో హెచ్ఆర్ఏ, ఇంటి రుణంపై వడ్డీ ప్లస్ అసలు చెల్లింపు మీద రాయితీలు, ఆదాయం పన్ను చట్టం 80సీ, 80డీ, 80సీసీడీ తదితర సెక్షన్ల కింద మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. కొత్త ఆదాయం పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఇతర పథకాల మినహాయింపుకు అవకాశం ఉండదు.
రూ.12 లక్షల (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) ఆదాయం వరకూ పాత ఆదాయం పన్ను కంటే కొత్త (2025-26) ఆదాయం పన్ను విధానమె మెరుగు. గరిష్టంగా డిడక్షన్లు + మినహాయింపులు కలిపి రూ.5.75 లక్షలు, మొత్తం వేతనంలో 30 శాతం హెచ్ఆర్ఏ క్లయిమ్ చేయొచ్చు. హెచ్ఆర్ఏ కింద రూ.3,82,500తోపాటు రూ.5.75 లక్షల డిడక్షన్స్ ప్లస్ మినహాయింపులు ప్లస్ స్టాండర్డ్ డిడక్షన్ కలిపి రూ.9.57,000 వరకూ మినహాయింపులు పొందొచ్చు. అయితే, రూ.12 లక్షల పై చిలుకు ఆదాయం కల వారు పాత ఆదాయం పన్ను కింద పన్ను చెల్లించడమే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. పన్ను ఆదా పథకాల ద్వారా రూ.5.25 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. దీంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల వరకూ మినహాయింపు పొందొచ్చు.
పన్ను చెల్లింపు దారుడి ఆదాయం రూ.13.75 లక్షలు అనుకుందాం. హెచ్ఆర్ఏ వర్తించకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.57,500. కొత్త ఆదాయం పన్ను శ్లాబ్‌ల కింద రూ.75 వేలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన స్థూల ఆదాయం రూ.15.75 లక్షలు అనుకుందాం. కొత్త ఆదాయం పన్ను శ్లాబ్‌తో పోలిస్తే హెచ్ఆర్ఏ లేకుండా పన్ను చెల్లించాలంటే పాత పాలసీ మెరుగ్గా ఉంటుంది. పాత ఆదాయం పన్ను విధానంలో రూ.5.25 లక్షల వరకూ పెట్టుబడులు, పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక హెచ్ఆర్ఏ క్లయిమ్ చేస్తే పాత ఆదాయం పన్ను విధానమే బెటర్ చాయిస్.
టాక్స్ పేయర్ ఆదాయం రూ.15.75 లక్షల పై చిలుకు ఉంటే హెచ్ఆర్ఏ కింద రూ. 3 లక్షల పై చిలుకు ఆదా చేయొచ్చు. పాత ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటే రూ.5.25 లక్షల వరకూ పొదుపు ఖాతాలు, పెట్టుబడి పథకాల్లో పొదుపు చేయొచ్చు.