Income Tax | గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను సెక్షన్ 87ఏ రిబేటు కోసం అర్హులైన పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అప్డేట్ చేసిన ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాలు.. ఐటీఆర్-2, ఐటీఆర్-3ల్లో ఆ రిబేటును క్లెయిమ్ చేసుకునేందుకు వారికి ఆదాయ పన్ను శాఖ అనుమతిచ్చింది. సెక్షన్ 87ఏ రిబేటును క్లెయిమ్ చేసుకునేందుకున్న గడువును పొడిగించి సవరించిన లేదా ఆలస్యంగా ఐటీఆర్‌లను దాఖలుచేసేవారికి ప్రయోజనం చేకూర్చాలన్న బాంబే హైకోర్టు ఆదేశాల మేరకే ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్తున్నారు.
సెక్షన్ 87ఏ కింద వచ్చే రిబేటు.. పన్ను చెల్లింపుదారులకు ఐటీ భారాన్ని తగ్గిస్తుంది. పాత పన్ను విధానంలో మొత్తం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపున్నా, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షలలోపున్నా ఈ రిబేటును క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆదాయ పన్ను ‘నిల్’కు మారుతుంది. అయితే గత ఏడాది జూలై 5 నుంచి రకరకాల ఆదాయాలకు సంబంధించి ఈ రిబేటు విషయంలో సాంకేతిక సమస్యల్ని ట్యాక్స్‌పేయర్స్ ఎదుర్కొంటున్నారు. ఐటీ శాఖ నిర్ణయంతో అందులో కొంత స్పష్టత వచ్చినైట్టెంది.