New Rules | మార్చి నెల నేటితో ముగియనున్నది. రేపటి నుంచి ఏప్రిల్ మాసం మొదలవనున్నాయి. ప్రతి నెలా కొత్తగా రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి సైతం బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్, యూపీఐ రూల్స్, గ్యాస్ ధరల్లో మార్పులు సహా కొన్ని నిబంధనలు మారబోతున్నాయి. దాంతో జనాల జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న రూల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కొత్త పన్ను స్లాబ్‌లు, రేటు మార్పులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సవరించిన ఆదాయపు పన్ను నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను నియమాల ప్రకారం.. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. జీతం పొందే వ్యక్తులు రూ.75వేల ప్రామాణిక మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. దాంతో రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) భద్రతను పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. చాలాకాలంగా పని చేయని బ్యాంకుల యూపీఐ లావాదేవీలను మూసివేయనున్నారు. యూపీఐకి లింక్ చేయబడిన డియాక్టివేట్ అయిన వాటిని దశలవారీగా తొలగించేందుకు ఎన్పీసీఐ బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించింది. యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్ చాలాకాలంగా ఉపయోగించకపోయినట్లయితే ఏప్రిల్ నుంచి నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి రూల్స్ సైతం మారనున్నాయి. పలు బ్యాంకులు ఆయా కార్డుల రివార్డ్ పాయింట్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సింప్లిక్లిక్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్ రివార్డు పాయింట్ల రూల్స్ మారాయి. ఎయిర్ ఇండియాతో ఎయిర్‌లైన్ విలీనం తర్వాత యాక్సిస్ బ్యాంక్, విస్తారా క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరిస్తున్నది. ఇవి కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయి.
ఆగస్టు 2024లో ప్రభుత్వం ప్రారంభించిన ఏకీకృత పెన్షన్ పథకం (UPS) పాత పెన్షన్ పథకాన్ని భర్తీ చేస్తుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. కొత్త పెన్షన్ పథకానికి సంబంధించిన రూల్స్ మార్పు దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేయనున్నది. దీని కింద కనీసం 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల సగటు ప్రైమరీ సాలరీలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు.
ఏప్రిల్ ఒకటి నుంచి జీఎస్టీ రూల్స్ సైతం మారనున్నాయి. పన్ను చెల్లింపుదారుల కోసం సేవల పన్ను (GST) పోర్టల్‌లో ఇప్పుడు మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA) ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఎంఎఫ్‌ఏని తీసుకువచ్చింది. 180 రోజుల కంటే ఎక్కువ పాతది కాని ఆధార్ పత్రాలకు మాత్రమే ఈ-వేబిల్లులు (EWB) రూపొందిస్తారు. దాంతో పాటు, వస్తువులు, సేవల పన్ను నెట్వర్క్ (GSTN) వ్యాపారాల కోసం ఈ-ఇన్వాయిసింగ్ ప్రక్రియలోనూ మార్పులు చేస్తున్నది. ఏప్రిల్ 1 నుండి రూ.10 కోట్ల కంటే ఎక్కువ.. రూ.100 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ఈ-ఇన్వాయిస్లను అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.100 కోట్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది.
బ్యాంకులు సైతం మినిమం బ్యాలెన్స్ రూల్‌ని మారుస్తున్నాయి. వాస్తవానికి ఖాతా ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్‌ని అమలు చేస్తున్నాయి. ప్రాంతాల్లో అధికంగా బ్యాలెన్స్ కాగా.. సెమీ-అర్బన్ ఈ ప్రాంతాలలో మితమైన కనీస బ్యాలెన్స్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలు అమలు కానున్నాయి. కనీస బ్యాలెన్స్ ఖాతాలో ఉంచకపోతే.. జరిమానా చెల్లించే అవకాశం రానున్నది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకులు ఏప్రిల్ ఒకటి నుంచి కనీస బ్యాలెన్స్ రూల్స్‌లో మార్పులు చేయనున్నాయి.
ప్రతి నెలా చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ సారి కూడా ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. మార్చిలోనూ పెట్రోలియం కంపెనీలు ధరలను సవరించిన విషయం తెలిసిందే. దాంతో కమర్షియల్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. సిలిండర్‌కు రూ.6 పెరిగింది. ఫిబ్రవరిలోనూ కంపెనీలు రూ.7 వరకు పెంచాయి.