న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : గ్రాట్యుటీ అర్హతలో కొత్త కార్మిక చట్టాలతో కీలక మార్పులే చోటుచేసుకున్నాయి. కేవలం ఏడాదిపాటు సర్వీస్ కొనసాగితే ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులే. మునుపు ఇది కనీసం ఐదేండ్లుగా ఉన్నది. అయితే ఈ నిబంధన ఎప్పట్నుంచి వర్తిస్తుంది? అన్న సందిగ్ధం అంతటా నెలకొన్న నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తమ ఎఫ్ఏక్యూ డాక్యుమెంట్లలో ఒకదానిలో స్పష్టత ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 21 నుంచి కొత్త గ్రాట్యుటీ రూల్స్ అమల్లోకి వస్తాయన్నది.
దీంతో 2025 నవంబర్ 21న, ఆ తర్వాత కంపెనీల్లో చేరిన వర్కర్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే ప్రో రాటా ప్రాతిపదికన ఫిక్స్డ్-టర్మ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్లే అర్హులు. ఏడాది, రెండేండ్లకుగాను రాతపూర్వక ఒప్పందంపై ఉద్యోగంలో చేరేవారే ఫిక్స్డ్-టర్మ్ ఉద్యోగులు. కాగా, శాశ్వత లేదా రెగ్యులర్ ఉద్యోగులకు ఎప్పట్లాగే ఐదేండ్లపాటు ఒకే సంస్థలో పనిచేస్తేనే ఆ కంపెనీ నుంచి గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి వీలుంటుంది.