iPhone : ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ సంస్థ షాకిచ్చింది. బుధవారం కొత్త ఐఫోన్ విడుదల చేసిన యాపిల్.. పాత మోడళ్ల ధరలను పెంచేసింది. యాపిల్ ఎప్పటినుంచో అనుసరిస్తున్న పాత సంప్రదాయానికి ఇది విరుద్దం. ఎందుకంటే కొత్త ఐఫోన్ విడుదలైన తర్వాత సాధారణంగా పాత ఐఫోన్ల ధరల్ని ఇండియాలో యాపిల్ తగ్గిస్తుంటుంది. కానీ, ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా కొత్త ఫోన్ రిలీజైన తర్వాత కూడా పాత ఫోన్ ధరల్ని విపరీతంగా పెంచింది.
ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న ఐఫోన్ 17 ధరను సంస్థ విపరీతంగా పెంచేసింది. , సగటున రూ.17,000 వరకు ధర పెరిగింది. నిన్నటిదాకా ఐఫోన్ 17 ధర రూ.82,900గా ఉండగా, ఇప్పుడు రూ.17,000 వరకు పెంచింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం 99,900గా ఉంది. అలాగే, ఐఫోన్ 16 ధర రూ.20,000 పెరిగింది. ఐఫోన్ 17ఈ ధర రూ.15,000 వరకు పెరిగింది. ఐఫోన్ ఎయిర్ ధరలు కూడా సగటున రూ.30,000 పెరిగింది. దీని ధర రూ.1,49,900కు చేరింది. దీంతో కొత్త ఐఫోన్ విడుదలైన తర్వాత పాత ఐఫోన్ల ధరలు తగ్గుతాయని.. ఆ తర్వాత పాత మోడల్ ఐఫోన్ కొనుక్కుందామని ఆశపడిన యాపిల్ బ్రాండ్ లవర్స్‌కు షాక్ తగిలినట్లైంది.
ఇక, బుధవారం జరిగిన యాపిల్ ఈవెంట్లో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయోతోపాటు, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వంటి ఫోన్లు విడుదలయ్యాయి. చిప్‌ఫ్లేషన్.. అంటే మొబైల్ ఫోన్లలో వాడే మెమొరీ చిప్స్ ధరలు పెరగడం వల్లే ఐఫోన్ల ధరలు పెరిగాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్ కొనాలంటే సగటున రూ.లక్ష వరకు చెల్లించాల్సిందే.