ఎర్రుపాలెం, సెప్టెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా భూముల విస్తీర్ణంలో తేడాలు, రికార్డుల్లోని లోపాలు, హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని తాటిగూడెం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్ రైతుల సమక్షంలో అధికారులు నిర్వహిస్తున్న రీ-సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి సర్వే తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక యంత్రాల సహాయంతో చేపడుతున్న భూ రీ-సర్వే ద్వారా ప్రతి రైతు భూమికి డిజిటల్ మ్యాప్‌తో కూడిన భూధార్ కార్డు అందుతుందని తెలిపారు. గతంలో కొంతమంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు లేకపోవడం, ఆన్లైన్లో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు ఉండడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.
కొందరి భూమి తక్కువగా, మరికొందరి భూమి ఎక్కువగా నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయని, రీ-సర్వే ద్వారా ఇలాంటి లోపాలను గుర్తించి సరిచేస్తామని స్పష్టం చేశారు. రీ-సర్వేకు సంబంధించి రైతులకు 48 గంటల ముందుగానే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. రైతుల సమక్షంలోనే భూములను కొలుస్తామని, రైతులు స్వయంగా తమ భూమి హద్దులను చూపించడంతో పాటు పక్క భూముల రైతులను కూడా పిలిచి పంచనామా నిర్వహించి హద్దులను నిర్ధారిస్తామని వివరించారు. సర్వేకు నోటీసులు అందుకున్న రైతులు, వారి కుటుంబంలోని భూ హక్కుదారులు, పట్టాదారు పాస్‌బుక్‌లో పేర్లు ఉన్నవారు తప్పనిసరిగా హాజరై పూర్తి వివరాలు అందించి అధికారులకు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయిన వెంటనే భూమి విస్తీర్ణ వివరాలను రైతులకు అక్కడికక్కడే తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసిన తర్వాతే తుది వివరాలను నిర్ధారిస్తామని, అవసరమైతే రైతుల సమ్మతితో భూమి విస్తీర్ణానికి సంబంధించిన సంతకాలు కూడా తీసుకుంటామని చెప్పారు.
మొత్తం రీ-సర్వే ప్రక్రియ భూ హక్కుదారుల సమక్షంలోనే పారదర్శకంగా జరుగుతుందని, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. రీ-సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తామని తెలిపారు. అభ్యంతరాలకు నిర్దిష్ట గడువు కల్పించి, వాటిని స్వీకరించి పరిష్కరించిన అనంతరం తుది భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయితే భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు భూమిపై మరింత భద్రత కలుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. సునీతా ఎలిజబెత్, సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, ఆర్ ఐ రవికుమార్, సర్వేయర్ రాజశేఖర్, జీపీవో లు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు,రవి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కర్నాటి సుధాకర్ రెడ్డి, గౌర్రాజు రాములు, కూడెల్లి నాగేశ్వరరావు, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.