Sardar 2 | తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ‘సర్దార్ 2’ విషయంలో వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సర్దార్’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కార్తీకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ సినిమాకు మంచి స్పందన వస్తుందని భావించారు.అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి రోజు నుంచే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ‘సర్దార్ 2’ విఫలమైందనే వార్తలు వస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ‘సర్దార్ 2’ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదవుతోంది
ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం ఆటలకు ప్రేక్షకుల సంఖ్య మరింత తక్కువగా ఉండటంతో కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ కనీస స్థాయికి కూడా చేరకపోవడంతో షోలు రద్దు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా స్టార్ హీరో సినిమా విడుదలైన తొలి రోజుల్లో మల్టీప్లెక్స్‌లలో ముందస్తు బుకింగ్స్‌తోనే మంచి సందడి కనిపిస్తుంది. కానీ ‘సర్దార్ 2’ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించకపోవడం కార్తీ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సర్దార్ 2’ విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే వార్తలు వచ్చాయి. సీక్వెల్ కావడంతో మొదటి భాగం విజయాన్ని బేస్ చేసుకుని భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావించినా.. బుకింగ్స్‌లో మాత్రం పెద్దగా ఊపు కనిపించలేదని సమాచారం.
కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు పూర్తిస్థాయి ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయిందనే చర్చ జరుగుతోంది. విడుదల తర్వాత వచ్చిన మిశ్రమ స్పందన దీనిపై మరింత ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ‘సర్దార్ 2’పై వస్తున్న ప్రధాన విమర్శల్లో సినిమా నిడివి కూడా ఒకటిగా మారింది. దాదాపు మూడు గంటల నిడివి ఉండటం, ముఖ్యంగా ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మొదటి భాగంలో ఉన్న వేగం, ఆసక్తికరమైన మలుపులను సీక్వెల్లో కొనసాగించడంలో దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తడబడ్డారనే టాక్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. అవి కథతో పూర్తిస్థాయిలో ముడిపడలేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో కార్తీతో పాటు ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ వంటి క్రేజీ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.కాని కథ, కథనం, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధానం వంటి అంశాలే చివరకు బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయిస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి.