New GST Rates | కేంద్ర సర్కారు జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో శ్లాబ్‌లను కుదిస్తూ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో రెండు మాత్రమే ఉండనున్నాయి. దాంతో పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, తక్కువ సీసీ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలుగనున్నది. 350 సీసీ లేదంటే అంతకంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దాంతో హీరో స్ల్పెండర్, హోండా షైన్ సహా తక్కువ సీసీ ఇంజిన్ సామర్థ్యం గల బౌక్ల ధరలన్నీ తగ్గనున్నాయి. ఆయా బైక్‌ల మోడల్స్‌పై పదిశాతం వరకు డబ్బు ఆదా కానున్నది. అయితే, 350 కంటే ఎక్కువ సీసీ గల బైక్‌లను కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం నిరాశే మిగలనున్నది.
ఎందుకంటే 350సీసీ కంటే ఎక్కువ శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లను ‘సిన్ టాక్స్’ శ్లాబ్‌లోనే ఉంచారు. వాటిపై 40శాతం జీఎస్టీ వర్తిస్తుంది. జీఎస్టీ శ్లాబ్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ వంటి కంపెనీలు అన్ని రకాల బైక్‌లపై ఒకే జీఎస్టీ రేట్‌ను వర్తింపజేయాలని కోరాయి. అయితే, 390సీసీ, 400సీసీ, 450సీసీ, 650సీసీ, బీఎండబ్ల్యూ, కవాసకి, హోండా, యమహా క్లాస్ బైక్‌లపై కూడా 40శాతం విధించనున్నారు. నివేదిక ప్రకారం కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. అప్పటిలోగా బైక్‌లను కొనుగోలు చేస్తే 10శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం, బైక్‌లపై జీఎస్టీ 28శాతం వర్తిస్తున్నది. అయితే, 400 సీసీ అంతకంటే ఎక్కువ సీసీ మోటార్ సైకిల్స్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే మాత్రం ఎమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత జీఎస్టీ సెప్టెంబర్ 21 వరకు అవకాశం ఉంటుంది.
22వ తేదీ తర్వాత ఆయా బైక్‌ల ధరలను పెరిగే అవకాశాలున్నాయి. బజాజ్ పల్సర్ NS 400Z, బజాజ్ డొమినార్ 400, KTM 390 డ్యూక్, KTM 390 RC, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 450, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650, ట్రయంఫ్ స్పీడ్ 400, ట్రయంఫ్ థ్రక్స్టన్ 400, ట్రయంఫ్ స్పీడ్ T4, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X, హోండా CB 650R ధరలు పెరగనున్నాయి. బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, ట్రయంఫ్, ఎటీఎం వంటి కంపెనీలు ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లను సరసమైన ధరలకు తయారు చేస్తున్నాయి. స్థానిక తయారీ ఈ కంపెనీలకు పెద్ద ఇంజిన్లతో బైక్‌ల ధరను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ విభాగంలో బైక్‌లు ఇప్పటికే చాలా తక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు పన్నులు పెరిగితే 350సీసీ.. అంతకంటే కంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్‌ల అమ్మకాలు మరింత పడిపోయే అవకాశాలున్నాయి.