న్యూఢిల్లీ, జనవరి 18: పీఎఫ్ చందాదారులకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో శుభవార్తను అందించింది. పీఎఫ్ చందాదారులు తమ పేర్లను, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. ఇకపై యజమాని, ఈపీఎఫ్‌వో ఆమోదం అవసరం లేకుండానే ఆన్లైన్లో సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్పర్ చేసుకునే మరో సదుపాయాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ నూతన సేవలను కేంద్ర కార్మికత మంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రారంభించారు. ఈపీఎఫ్‌వో చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలు పేరు, పుట్టిన తేదీ, తండ్రి/తల్లి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం వీడిన తేదీ వంటి వివరాలు ఇక నుంచి సులభంగా మార్చుకోవచ్చును. 2017 అక్టోబర్ 1 తర్వాత జారీ అయిన ఈపీఎఫ్‌వో చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చును. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు.
అలాగే అంతకుముందు ఉన్న చందాదారులు ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేసుకునే పెసులుబాటు ఉన్నది. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను కూడా తగ్గించినట్లు పేర్కొంది. ఈపీఎఫ్‌వో చందాదారుల్లో 27 శాతం మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని సులభతరంగా వ్యక్తిగత వివరాలు సవరించుకోవాలనే ఉద్దేశంతో ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మాండవీయా తెలిపారు.
ఉద్యోగులు తమ పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఈ సమయంలోనూ ఈపీఎఫ్‌లో మార్పులు చేయడానికి ఆఫీసుల చుట్టు తిరగాల్సి వస్తున్నదని, ఈ భారం నుంచి తగ్గించాలని వచ్చిన విజ్ఞప్తులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు, ఆధార్‌తో లింక్ చేయని పీఎఫ్ ఖాతాల్లో మార్పులు చేయాలంటే డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 లక్షలకు పైగా రిక్వెస్ట్‌లు వచ్చాయని, వీటిలో 40 శాతం సమస్యలను ఐదు రోజుల్లో పరిశీలించగా, 47 శాతం రిక్వెస్ట్‌లు 10 రోజుల్లో పూర్తైనట్లు తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో 45 శాతం మందికి తక్షణమే ఊరట లభించనుండగా, మరో 50 శాతం కరెక్షన్లు యజమాని దగ్గర పరిష్కారం కానున్నాయి.