EPFO | ఈపీఎఫ్ఓలో సబ్స్క్రైబర్లకు భారీ రిలీఫ్ లభించనున్నది. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య అవసరాలు, ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా కోసం క్లయిమ్‌లు దాఖలు చేస్తుంటారు. అలా క్లయిమ్ దరఖాస్తు చేస్తున్నప్పుడు చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్ బుక్ ఫోటోలు అప్ లోడ్ చేయాల్సి వచ్చేది. ఇక నుంచి అలా బ్యాంక్ చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్ బుక్ ఫోటోలు అప్ లోడ్ నిబంధనను సడలించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
అలా ఆన్లైన్లో తమ ఖాతాదారులు దాఖలు చేసే క్లయిమ్స్ పరిష్కారం వేగవంతం చేయడానికి ఈ సడలింపు ఉపకరిస్తుంది. తన సబ్ స్క్రైబర్ల సొంత ఖాతా గల బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ద్వారా వారి కేవైసీ వివరాలను ఈపీఎఫ్ఓ నేరుగా చెక్ చేస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ) వినియోగం ద్వారా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ల బ్యాంకు ఖాతాలను వారు పని చేస్తున్న సంస్థలు ధృవీకరిస్తాయి. అలాగే సబ్ స్క్రైబర్లు సమర్పించే ఈధార్ నంబర్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ధృవీకరిస్తుంది.