Bajaj Chetak | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ చేతక్.. ఈవీ రంగంలో మరో కొత్త స్కూటర్ ఆవిష్కరించింది. చేతక్ 35 సిరీస్లో 3501, 3502 వర్షన్లను తెచ్చింది. 3501 వర్షన్ ప్రీమియం స్కూటర్ కాగా, దీని ధర రూ.1.27 లక్షలు (ఎక్స్ షోరూమ్), 3502 వర్షన్ ధర రూ.1.20 లక్షలు) పలుకుతుంది. త్వరలో ఇదే సిరీస్లో 3503 మోడల్ ఆవిష్కరించనున్నది.
మొదటి బజాజ్ చేతక్ ఈవీ మాదిరే అదే క్లాసిక్ లుక్తో కొత్త మోడల్ స్కూటర్లను తెచ్చింది. ఇందులో 3.5 కిలోవాట్ల బ్యాటరీ, 4 కిలోవాట్ల మోటార్ జత చేశారు. ఈ స్కూటర్ గరిష్టంగా 73 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 153 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. పూర్తిగా బ్యాటరీ చార్జింగ్కు మూడు గంటల సమయం పడుతుంది. 5-అంగుళాల టచ్ టీఎఫ్టీ డిస్ ప్లే, మ్యాప్స్ తపాటు కాల్ ఆన్సర్ లేదా రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్ వసతులు ఉన్నాయి. జియో ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్ స్పీడ్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేశారు.
తొలుత బజాజ్ చేతక్ 2020 తొలి ఈవీ స్కూటర్ ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో 3201, 3202, 2903, 3201 స్పెషల్ ఎడిషన్ అనే పేర్లతో నాలుగు వర్షన్ స్కూటర్లు మార్కెట్లోకి తెచ్చింది. ఈవీ మార్కెట్లోకి ఎంటరైనప్పటి నుంచి ఇప్పటి వరకూ మూడు లక్షల బజాజ్ చేతక్ స్కూటర్లు విక్రయించింది.