Tata Neu App | ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలందించే టాటా సన్స్ సూపర్ యాప్.. టాటా నియు ప్రారంభమైంది. గురువారం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ టాటా నియుకు స్వాగతం అని పేర్కొంటూ గురువారం అధికారికంగా ప్రారంభించారు. టాటా సన్స్‌లో కొత్త సంస్థ టాటా డిజిటల్.. మీ వద్దకు టాటా నియు యాప్ తీసుకొచ్చింది. ఈ రోజు నియు డే అని చంద్రశేఖరన్ మెసేజ్ పెట్టారు. కొత్త మార్గంలో అద్భుతమైన టాటా సన్స్ ప్రపంచంలోకి వెళ్లొచ్చు అని పేర్కొన్నారు. ఈ యాప్‌తో భారతీయుల జీవనం హాయిగా సాగిపోయేలా చేయడమే తమ లక్ష్యం అని వ్యాఖ్యానించారు.
ఎంతో కాలంగా టాటా సూపర్ యాప్ కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో, జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్‌లకు ఈ-కామర్స్ సేవల్లో టాటా నియు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ యాప్ ద్వారా టాటా సన్స్ అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
ఏడాది కాలంగా టాటా నియు యాప్ అభివృద్ధి చేశారు. విమాన టిక్కెట్లు మొదలు హోటల్స్ బుకింగ్, ఔషధాల నుంచి రోజువారీ నిత్యావసర వస్తువులను ఈ యాప్ ద్వారా ఆన్లైన్లోనే కొనుగోలు చేయొచ్చు. ఇతర సేవలకు చెల్లింపులు కూడా చేయొచ్చు.
క్రొమా, వెస్ట్‌సైడ్, ఎయిర్ ఏషియా ఇండియా, తాజ్ హోటల్స్, బిగ్ బాస్కెట్, ఐహెచ్‌సీఎల్, క్యూమిన్, స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా సీలిక్యూ, టాటా ప్లే బ్రాండ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్‌లో టాటా మోటార్స్, విస్తారా, ఎయిరిండియా, తనిష్క్, టైటాన్ బ్రాండ్లను తీసుకొస్తారు.