హైదరాబాద్, అక్టోబర్ 8: డయాలసిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్ దూకుడు పెంచింది. భారత్‌తోపాటు నేపాల్, ఫిలిప్పీన్స్, ఉజ్బేకిస్తాన్లలో తన క్లినిక్స్‌ల సంఖ్యను 500కి పెంచుకున్నట్టు తాజాగా ప్రకటించింది. 2010లో తన తొలి క్లినిక్‌ను ప్రారంభించిన సంస్థ..కేవలం 15 ఏండ్లలోనే ఈ కీలక మైలురాయికి చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ నాలుగు దేశాల్లో ప్రతియేటా 33 వేలకు పైగా రోగులకు డయాలసిస్ నిర్వహిస్తున్నది. నిధుల సేకరణకోసం సంస్థ ఐపీవోకి రావడానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ఇటీవల దరఖాస్తు చేసుకున్నది.
ఇందుకు సంబంధించి సెబీ ఇప్పటి వరకు అనుమతినివ్వలేదు. దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో 125 క్లినిక్‌లను నిర్వహిస్తున్న సంస్థ..218 క్లినిక్స్‌లను తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసింది. 1,642 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ…132 డయాలసిస్ టెక్నిషన్లకు శిక్షణ కూడా ఇస్తున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.755.81 కోట్ల ఆదాయంపై రూ.67.1 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఐపీవో ద్వారా సేకరించనున్న నిధుల్లో రూ.129 కోట్లను 167 నూతన డయాలసిస్ సెంటర్లను నెలకొల్పడానికి వినియోగించనున్నట్టు ప్రకటించింది.
ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
హైదరాబాద్, అక్టోబర్ 8: దేశంతో విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను కార్పొరేట్ గవర్నెన్స్‌లో గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో సంస్థ మెరుగైన ప్రమాణాలు పాటించినందుకుగాను ఈ అవార్డు లభించిందని కంపెనీ సీఈవో జన్మేజయ మహాపాత్ర తెలిపారు. ఈ అవార్డును ఇటీవల లండన్‌లో జరిగిన ఐవోడీ ఇండియా 2025 వార్షిక సమావేశంలో ఆయన అందుకున్నారు.