DEA | న్యూఢిల్లీ, మే 2 : దేశ రుణ భారం చాలా ఎక్కువగా ఉందని, ఇది తగ్గాలని.. అప్పుడే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు భారత క్రెడిట్ రేటింగ్‌ను పెంచుతాయని ఆర్థిక వ్యవహారాల (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ అన్నారు. ఈ సర్కారీ అప్పులపై చెల్లించే వడ్డీ భారం కూడా మోయలేనివిధంగా తయారవుతున్నదని, దాన్ని దించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదనీ ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఐఎస్ఏఏసీ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ కాన్ఫరెన్స్‌లో అజయ్ మాట్లాడుతూ.. అప్పులు పెరుగుతూపోవడం మంచిదికాదన్నారు.
రేటింగ్ అప్‌గ్రేడ్ కోసం రేటింగ్ ఏజెన్సీలతో భారత్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోందని వివరించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడానికి మితిమీరిన రుణ భారమేనంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఖర్చులకు సంబంధించి స్పందిస్తూ.. చాలావరకు సమతూకం లోపించిందన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాభివృద్ధి కంటే రుణ నిధులను వ్యయాలను పెంచుకోవడానికే వినియోగిస్తున్నాయన్నారు. కాగా, ట్యాక్స్-టు-జీడీపీ రేషియో 20 శాతానికి చేరాలంటే 5-6 ఏండ్లు పట్టవచ్చన్నారు.