ముంబై, సెప్టెంబర్ 7: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కొత్త చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మాటల (సంభాషణలు) ఆధారంగా పేమెంట్స్‌ను పూర్తిచేసే వీలుండటం విశేషం. ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ, హలో యూపీఐ, బిల్‌పే కనెక్ట్, యూపీఐ ట్యాప్ అండ్ పే, యూపీఐ లైట్ ఎక్స్ సర్వీసులను ఎన్పీసీఐ ప్రారంభించింది.
సంభాషణల ఆధారంగా జరిగే చెల్లింపుల విధానం ఇది. యాప్‌లు, టెలికం కాల్స్, ఐవోటీ డివైజెస్ ద్వారా కేవలం మాట్లాడుతూనే వినియోగదారులు పేమెంట్స్‌ను పూర్తి చేయవచ్చు. ఇప్పటికైతే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పొందే వీలున్న ఈ సర్వీస్.. త్వరలో వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. కాగా, పేమెంట్ చేయాలనుకునే కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవస్థ నిశబ్దంగా వింటుంది. ఆ తర్వాత సదరు సంభాషణను తిరిగి మాట్లాడేందుకు టెక్స్, నెంబర్స్లోకి మార్చుకుంటుంది. ఈ క్రమంలో అన్ని వివరాలు సరైనవే అనిపిస్తే వినియోగదారుని సమ్మతి, వారిచ్చే పిన్ సాయంతో చెల్లింపుల ప్రక్రియ ముగుస్తుంది. వృద్ధులు, డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన లేనివారికి హలో యూపీఐ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. ఇక యూపీఐ ఆధారిత యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్‌తో క్రెడిట్ లైన్‌ను ఎంచుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ లైట్ ఎక్స్‌తో ఫీచర్ ఫోన్ యూజర్లూ అప్‌గ్రేడ్ కావచ్చు. మెసేజింగ్ యాప్‌పై ‘Hi’ పంపించి బిల్లులను చెల్లించేలా బిల్‌పే కనెక్ట్‌ను రూపొందించారు. ఇందుకోసం జాతీయస్థాయిలో నెంబర్లను భారత్‌బిల్‌పే తీసుకొచ్చింది. ఇక యూపీఐ ట్యాప్ అండ్ పే ద్వారా దుకాణాల్లో మరింత సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చు.