ముంబై, జూన్ 9: సూక్ష్మ రుణ సంస్థల్లో (మైక్రోఫైనాన్స్ కంపెనీలు) అధిక వడ్డీరేట్లు, బాకీల వసూళ్లకు అవలంబిస్తున్న కఠిన చర్యలు ఆగట్లేదని, వీటివల్లే మైక్రోఫైనాన్స్ రంగం ఇబ్బందుల్లో పడుతున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ల (డీజీ)లో ఒకరైన ఎం రాజేశ్వర్ రావు అన్నారు. ఇటీవల జరిగిన హెచ్ఎస్బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మైక్రోఫైనాన్స్ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. అయినప్పటికీ మైక్రోఫైనాన్స్ కంపెనీల అభ్యంతరకర తీరు మారట్లేదన్నారు.
నిజానికి మైక్రోఫైనాన్స్ కంపెనీలకు నిధులు తక్కువ వడ్డీకి, సులువుగా లభ్యమవుతున్నా.. రుణాలపై అధిక వడ్డీరేట్లు వసూలు చేస్తున్నారని, రుణగ్రహీతలపై మితిమీరిన భారం మోపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా ఉన్నాయన్న ఆయన.. కొన్ని మైక్రోఫైనాన్స్ సంస్థల అకృత్యాలకు అడ్డుకట్ట పడాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. వెనుకబడిన ఆదాయ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఉండాల్సిన మైక్రోఫైనాన్స్ కంపెనీలు.. ధనార్జనే లక్ష్యంగా ముందుకెళ్తుండటం విచారకరమని పేర్కొన్నారు. ఇక బీమా పాలసీలనూ విక్రయిస్తున్నారన్నదానిపై స్పందిస్తూ ఆర్బీఐ దీనికి సంబంధించి తగు మార్గదర్శకాలను విడుదల చేయాలని చూస్తున్నట్టు చెప్పారు.