న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది గొప్ప ఉత్సాహమే లభించింది. ఈ సంవత్సరం మొదలు నవంబర్ నెలాఖరుదాకా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఏకంగా రూ.17 లక్షల కోట్లపైనే పెరిగింది మరి. గత ఏడాది డిసెంబర్ 31కల్లా రూ.50.78 లక్షల కోట్లుగా ఉన్న ఆస్తులు.. గత నెలాఖరుకు ఆల్టైమ్ హైని తాకుతూ రూ.68 లక్షల కోట్లకు చేరాయి.
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (యాంఫీ) తాజాగా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.2.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ గణాంకాలూ వస్తే ఆస్తులు మరింతగా పెరగడం ఖాయమే. ఈ క్రమంలో ఈక్విటీ ఫండ్స్ల్లోకి, ప్రధానంగా సిప్ల ద్వారా పెట్టుబడులు వచ్చే ఏడాది కూడా పెరుగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తులు ఇలా పెరగడం ఇది వరుసగా 12వ సంవత్సరం కావడం విశేషం.