ముంబై, నవంబర్ 11 : మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) ఈక్విటీ పథకాల్లోకి గత నెల పెట్టుబడులు దాదాపు 19 శాతం పడిపోయాయి. అక్టోబర్‌లో నికరంగా రూ.24,691 కోట్లకే పరిమితమైనట్టు మంగళవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ సంఘం (యాంఫీ) తెలిపింది. అంతకుముందు నెల సెప్టెంబర్‌లో రూ.30,422 కోట్లుగా ఉండగా.. ఆ మునుపు ఆగస్టులో రూ.33,430 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఎంఎఫ్ ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎంచుకొనే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు)ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.29,529 కోట్లుగా ఉన్నా యి. అయితే అంతకుముందు నెల సెప్టెంబర్‌లో రూ.29,631 కోట్లుగా నమోదయ్యాయి.
మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీముల్లోకి తగ్గుతున్న పెట్టుబడుల ప్రవాహాన్ని లాభాల స్వీకరణ వల్లే జరుగుతున్నదిగా యాంఫీ సీఈవో వీఎన్ చలసాని అభివర్ణిస్తున్నారు. మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మెజారిటీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పెద్దపీట వేస్తున్నారని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో ఓవరాల్ రిడెంప్షన్స్ రూ.38,920 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు రూ.35, 982 కోట్లు అని వివరించారు. అక్టోబర్‌లో మొత్తం ఈక్విటీ స్కీముల్లోకి రూ.63,611 కోట్ల ఫండ్స్ వచ్చాయని, సెప్టెంబర్‌లో రూ.66,404 కోట్లు రావడం జరిగిందన్నారు.
అక్టోబర్ 31నాటికి ఈక్విటీ స్కీముల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.35.16 లక్షల కోట్లుగా ఉన్నది. సెప్టెంబర్ 30కల్లా రూ.33.68 లక్షల కోట్లుగా ఉన్నట్టు యాంఫీ గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే అక్టోబర్‌లో డెట్ స్కీముల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రూ.1.01 లక్షల కోట్లు పోయాయని చలసాని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్ ఎంఎఫ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని ఆస్తుల విలువ గతంతో పోల్చితే 5 శాతం పెరిగి రూ.79.88 లక్షల కోట్లకు చేరింది. రుణ మార్కెట్లలో అనుకూల కార్యకలాపాలు జోరుగా సాగడమే ఇందుకు కారణమని చలసాని చెప్పారు.
బంగారం ధరల్లో ర్యాలీ.. అక్టోబర్‌లో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) రూ.7,743 కోట్లను ఆకట్టుకునేలా చేసింది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల కింద ఉన్న ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయల మార్కును దాటి రూ.1.02 లక్షల కోట్లను తాకినట్టు యాంఫీ వెల్లడించింది. అయితే సెప్టెంబర్‌లో రూ.8,363 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు గణాంకాలు చెప్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ల్లోకీ రూ.3,000 కోట్ల ఇన్‌ఫ్లో ఉన్నది. వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.42,000 కోట్లను అధిగమించింది. కాగా, సిప్ ఆధ్వర్యంలోని ఆస్తులు రూ.16.25 లక్షల కోట్లను చేరగా.. మొత్తం ఇండస్ట్రీలో ఇది ఐదో వంతుకు సమానం కావడం విశేషం. క్రియాశీల సిప్ ఖాతాలు అక్టోబర్‌లో 9.45 కోట్లకు పెరిగాయి. అక్టోబర్‌లో 18 కొత్త స్కీములు రాగా.. వీటి ద్వారా రూ.6,062 కోట్ల నిధులను ఎంఎఫ్‌లు సమీకరించారు. సెప్టెంబర్‌లో 9 కొత్త పథకాలతో రూ.1,959 కోట్ల నిధులను అందిపుచ్చుకున్నారు. మొత్తం ఫోలియోలు 10,200కుపైగా ఉన్నాయి. అక్టోబర్‌లో 4 స్కీముల్లోకే రూ.2,007 కోట్లకుపైగా ఇన్‌ఫ్లో జరిగినట్టు చలసాని ఈ సందర్భంగా తెలియజేశారు.