
Elon Musk Starlink | భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ల కోసం ప్రీ- ఆర్డర్ బుక్ చేసుకున్న సభ్యులకు వారి సొమ్మును ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్టార్‌లింక్ శాటిలైట్ రీఫండ్ చేయనున్నది. శాటిలైట్ సర్వీసుల నిర్వహణకు లైసెన్స్ పొందే వరకు ప్రీ ఆర్డర్ పొందిన సభ్యులకు వారి సొమ్ము రీఫండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తమను కోరిందని స్టార్‌లింక్ మంగళవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రీ ఆర్డర్ పొందిన సభ్యులకు ఏ క్షణంలోనైనా వారి సొమ్ము రీఫండ్ అవుతుందని వెల్లడించింది.
ఎలన్ మస్క్ సారధ్యంలోని స్పేస్ ఏరోస్పేస్ కంపెనీ అనుబంధ సంస్థ స్టార్‌లింక్.. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. అందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నది. అయితే, లైసెన్స్ రాక ముందే స్టార్ లింక్ కోసం 5000 మందికి పైగా ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకున్నారు.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి అవసరమైన లైసెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదని స్టార్ లింక్ తెలిపింది. భారత్‌లో స్టార్‌లింక్ ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్సింగ్ ఫ్రేమ్ వర్క్ రూపకల్పనలో పలు అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని పేర్కొన్నది. సాధ్యమైనంత త్వరగా భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. స్టార్లింక్తోపాటు అమెజాన్ సారధ్యంలోని కౌపిర్, భారత్ భారతి గ్రూప్ అనుబంధ వన్ వెబ్ సంస్థలు దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి పోటీ పడుతున్నాయి.