Xiaomi India – Muralikrishnan | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ షియోమీ ఇండియా (Xiaomi India) అధ్యక్షుడు బీ మురళీకృష్ణన్ వైదొలగనున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని షియోమీ ఇండియా మంగళవారం తెలిపింది. ఆరేండ్ల పై చిలుకు షియోమీ ఇండియాలో పని చేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేనేజ్మెంట్లో డాక్టరేట్ పట్టా అందుకోవాలని మురళీకృష్ణన్ భావిస్తున్నారు. ‘టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌పై కన్జూమర్ బిహేవియర్’ అనే అంశంపై ఆయన అధ్యయనం కేంద్రం కానున్నది. అయితే షియోమీ ఇండియా అధ్యక్షుడిగా వైదొలిగినా కంపెనీకి ఇండిపెండెంట్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్‌గా మద్దతునిస్తారని షియోమీ ఇండియా తెలిపింది.
2018లో షియోమీ ఇండియాలో మురళీకృష్ణన్ చేరారు. నాటి నుంచి 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందడానికి ముందు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సహా పలు పోస్టుల్లో పని చేశారు. ఇండియాలో షియోమీ బ్రాండ్ విస్తరణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే షియోమీ ఇండియా పదో వార్షికోత్సవాన్నిపూర్తి చేసుకున్నది. గతేడాది షియోమీ ఇండియా నుంచి మను కుమార్ జైన్ వైదొలిగిన తర్వాత నిష్క్రమించిన వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ వారసుడెవరు అన్న విషయం మాత్రం షియోమీ ఇండియా వెల్లడించలేదు.