
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు జోరుగా పెరిగిన నేపథ్యంలో దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ.2,388 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను కూడా దాటింది. ఇందులో 50 శాతంపైగా వాటా కలిగిన ముకేశ్ సంపద 3.7 బిలియన్ డాలర్ల మేర పెరిగి 92.60 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రసిద్ధ ఇన్వెస్టరు వారెన్ బఫెట్ సంపద 102.6 బిలియన్ డాలర్లుకాగా, ముకేశ్ సంపద ఇంతకంటే 10 బిలియన్ డాలర్లే తక్కువగా ఉంది. ఫ్రాన్స్ వ్యాపారవేత్త ఎల్ ఓరియల్ అధినేత ఫ్రాంకోయిజ్ బెటన్కౌంట్ మేయర్స్‌తో ప్రస్తుతం అంబానీ పోటీపడుతున్నారు. మేయర్స్ సంపద 92.9 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌ను అత్యంత చౌకగా కేజీకి 1 డాలరు ధరలోపే అందిస్తామంటూ ఆర్ఐఎల్ చైర్మన్ ప్రకటించడంతో శుక్రవారం ఆ కంపెనీ షేరు 4 శాతంపైగా పెరిగింది. అలాగే అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏపీఆర్‌యూ (ఒక్కో యూజర్ ద్వారా వచ్చే సగటు ఆదాయం) రూ.160 నుంచి రూ.200కు పెరుగుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు రిలయన్స్ పెట్రోకెమికల్స్ వ్యాపారంలో వాటాను కొనేందుకు సౌదీ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నది. ఈ లావాదేవీ విలువ 25 బిలియన్ డాలర్లని అంచనా. ఈ అంశాలన్నింటితో గత వారం రోజులుగా భారీ ర్యాలీ జరుపుతున్నది.
