న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఓటీటీ రంగంలోకి ప్రవేశించేందుకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌తో అదానీ గ్రూప్ పోటీ పడుతున్నది. భారత్‌లోని తన టెలివిజన్, స్ట్రీమింగ్ బిజినెస్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న డిస్నీతో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతున్నదని బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇండియాలో జరిగే మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని జియోసినిమాకు డీస్నీ వదులుకోవడంతో పాటు హెచ్‌బీఓ కంటెంట్ సైతం జియోసినిమాకు వెళ్లిపోయింది. దీంతో డిస్నీ హాట్‌స్టార్ వేగంగా చందాదారుల్ని కోల్పోతున్నది.
ఈ ప్లాట్‌ఫాంను అమ్మకానికి పెట్టడంతో అదానీ గ్రూప్ రంగంలోకి దిగిందన్నది సమాచారం. అయితే ఇదే సమయంలో అదానీతో పాటు సన్ టీవీ నెట్వర్క్ కూడా డిస్నీని సంప్రదించిందని బ్లూంబర్గ్ వెల్లడించింది. అయితే ఈ చర్చలు ప్రాధమికదశలో ఉన్నాయన్నది. డీల్ విలువ ఎంత ఉంటుందో తెలియరాలేదు. ప్రస్తుతం డిస్నీ హాట్‌స్టార్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్ని యూజర్లకు ఉచితంగా స్ట్రీమ్ చేస్తున్నది. దీంతో మళ్లీ ఇది యాక్టివ్ యూజర్లను తప్పక పెంచుకుంటుందని అంటున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌కు తాజా సబ్స్క్రిప్షన్లు సైతం వస్తాయని అంచనా. కానీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత యూజర్లు డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్స్క్రయిబ్ చేస్తారా లేదా అన్నది సందేహమే. వాస్తవానికి ఉచితంగా స్ట్రీమ్ చేయడం ద్వారానే జియో సినిమా యూజర్ల ఆదరణ చూరగొన్నది. ఈ ప్లాట్‌ఫాం నిర్ణయాల కారణంగానే ప్రస్తుత డిస్నీ హాట్స్టాక్ క్రికెట్ ప్రపంచ కప్ గేమ్‌ల్ని ఉచితంగా అందిస్తున్నది.