ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) ఇవాళ కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్ అమలులోకి వస్తుంది. క్లౌడ్ డేటా స్టోరేజ్‌తో పాటు ఏఐ సర్వీసులు ప్రతి ఒక్కరికి ఇండియాలో అందుబాటులో ఉంటాయి. 47వ వార్షిక జనరల్ మీటింగ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. క్లౌడ్ స్టోరేజ్ ద్వారా యూజర్ల తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, డిజిటల్ కాంటెంట్, డేటాను సురక్షితంగా భద్రపరుచుకునే అవకాశం ఉంటుందని ముకేశ్ తెలిపారు. ఏఐకి అనుగుణంగా రిలయన్స్ టెలికాం జియో.. జియో బ్రెయిన్ కింద కొత్తరకమైన టూల్స్, ఫ్లాట్‌ఫామ్‌లను డెవలప్ చేస్తున్నది. 5జీ డార్క్ నుంచి 5జీ బ్రైట్‌కు ఇండియాను జియో మార్చేసినట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలోనే 13 కోట్ల మంది కస్టమర్లు జియో ట్రూ 5జీని తీసుకున్నట్లు తెలిపారు.