
హైదరాబాద్, డిసెంబర్ 9: ఎంటార్ టెక్నాలజీస్ దాదాపు రూ.150-200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని ఆదిభట్ల వద్ద ఎగుమతుల కోసం ఓ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని ఏర్పాటు చేయాలని చూస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ఈ ఇంజినీరింగ్ సంస్థ.. ఈ సెజ్‌లో ఓ ఎగుమతి ఆధారిత యూనిట్‌నూ తీసుకురానున్నది. ఎంటార్ టెక్నాలజీస్‌కు ప్రస్తుతం ఏడు వ్యూహాత్మక తయారీ కేంద్రాలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే ఓ ఎగుమతి ఆధారిత యూనిట్ కూడా ఉన్నది. క్రయోజెనిక్ ఇంజిన్ల కోసం లిక్విడ్ ప్రొపుల్షన్ ఇంజిన్లు, ఇతరత్రా కీలక విడిభాగాలను ఎంటార్ టెక్నాలజీస్ తయారు చేస్తున్నది. ముఖ్యంగా టర్బో పంపులు, బూస్టర్ పంపులు, గ్యాస్ జెనరేటర్లు, ఇంజెక్టర్ హెడ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నది. స్పేస్ లాంచ్ వెహికిల్స్‌కు ఎలక్ట్రో-న్యూమటిక్ మాడ్యూల్స్నూ అందిస్తున్నది. కాగా, ఆదిభట్లలో స్పెషలైజ్డ్ ఫ్యాబ్రికేషన్ కోసం అదనపు షెడ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్లు సంస్థ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నారు. షీట్ మెటల్ వర్టికల్ కోసం 9.6 ఎకరాల్లో ఇప్పటికే ఓ షెడ్‌ను సంస్థ నిర్మిస్తున్నది. వచ్చే నెలలో ఇది పూర్తి కానుండగా, కొత్త షెడ్ మాత్రం వచ్చే జూన్‌లో పూర్తయ్యే వీలుందన్నారు.
‘సెజ్‌కు అవసరమైన భూమి, కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం చూస్తున్నాం. ఇక్కడ సుమారు రూ.150-200 కోట్లతో ఓ ఎగుమతి ఆధారిత యూనిట్‌నూ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)తో చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఆదిభట్లలో ఇప్పటికే ఉన్న సెజ్‌కు సమీపంలో ఈ కొత్త సెజ్ కోసం ప్రయత్నిస్తున్నాం. సాకారమైతే మరిన్ని ప్రయోజనాలుంటాయి’
–పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ