ముంబై, జూన్ 2 : భారతీయ ఎంఎస్ఎంఈల రుణాల్లో వృద్ధి స్వల్పంగానే ఉన్నదని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తమ తాజా నివేదికలో పేర్కొన్నది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ సూక్ష్మ వ్యాపారాలు, తయారీ ఆధారిత రంగాల్లో ముందస్తు ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల రుణాల పోర్ట్‌ఫోలియో బకాయిలు దాదాపు రూ.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన 12.8 శాతం వృద్ధి నమోదైంది. పెరిగిన ఆస్తులు, రంగాలవారీగా విస్తృత భాగస్వామ్యాలు, విధానపరమైన మద్దతు కలిసొచ్చాయని క్రిఫ్ వెల్లడించింది. అయితే నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య క్రియాశీల రుణాలు సైతం 3.5 శాతం తగ్గిపోయాయని వివరించింది.