హైదరాబాద్, సెప్టెంబర్ 10: అంతర్జాతీయ ఫార్మాదిగ్గజంలో ఒకటైన ఎంఎస్డీ..హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ..నగరంలో నెలకొల్పిన టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్డీ ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి కేంద్రంగా నగర స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని మంత్రి చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో 2 వేలకు పైగా కంపెనీలు లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేశాయని, కేవలం తయారీ ఆధారిత రంగ స్థాయి నుంచి అధునాతన పరిశోధన-అభివృద్ధి వైపు రాష్ట్రం అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్శించడానికి గడిచిన రెండేండ్లుగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు, ఇటీవల ప్రవేశపెట్టిన లైఫ్ సైన్సెస్ పాలసీ కూడా ఇందుకు దోహదం చేస్తున్నదన్నారు.
మరోవైపు, ఈ ఏడాది కొత్తగా 100 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. గతేడాది నగరంలో 75 జీసీసీలు ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిశేఖ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ..నగరంలో వైబ్రాండ్ టెక్నాలజీ ఏకోసిస్టమ్, డిజిటల్, ప్రతిభావంతులు లభించడం వల్లనే ఇక్కడ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.