RBI MPC | ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నది. ఓ వైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరో వైపు రిజర్వ్ బ్యాంక్ సైతం వరుసగా పదోసారి రెపోరేటును యథావిధిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పెరిగిన గృహ రుణాల రేట్లను ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దేశీయ ద్రవ్యోల్బణం రేట్లను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, పప్పులు, నూనెలు, మసాలాల వరకు అన్నింటి ధర భారీగానే పలుకుతున్నాయి.
టమాటా రిటైల్ మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంప దిగుబడి మార్కెట్లకు చేరుతున్నా ధర మాత్రం తగ్గడం లేదు. కిలో ఆలుగడ్డలు రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతున్నది. పప్పుల ధరలు కిలోకు రూ.160 నుంచి రూ.180 వరకు ఉన్నది. కిలో పిండి రూ.35 నుంచి రూ.40 వరకు పెరిగింది. దీంతో వంటిల్లుపై భారీగా ప్రభావం పడుతున్నది. జనం సంపాదనలో అధిక భాగం తినేందుకే ఖర్చు చేయాల్సి వస్తున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అరికట్టేందుకు ఫిబ్రవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును 6.50శాతానికి పెంచింది. అప్పటి నుంచి రుణాలపై వడ్డీ భారం పెరిగింది. ప్రతినెలా రూ.2వేల నుంచి రూ.10వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. గృహ రుణాలు జారీ చేసే బ్యాంకులు సైతం ఈఎంఐని పెంచాయి.
అదే రేటుతో 20 సంవత్సరాలు ఉన్న ఈఎంఐని 25 నుంచి 27 సంవత్సరాలకు పెంచాయి. దీంతో రెపోరేటు కారణంగా రుణ గ్రహీతలు పెద్ద ఎత్తున బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించడానికే సంపాదన సరిపోతున్నది. రిజర్వ్ బ్యాంక్ రెపోరేట్లను తగ్గిస్తేనే బ్యాంకులు వడ్డీరేట్ల నుంచి జనానికి ఉపశమనం కలిగే అవకాశం ఉన్నది. ఇజ్రాయెల్ – ఇరాన్ సంక్షోభం దృష్ట్యా ద్రవ్యోల్బణం సైతం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ రెపోరేటును ఎక్కువగా ఉండేలా చూసుకుంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ నిర్ణయంతో సాధారణ ప్రజలే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది.