సరైన సమయానికి సరిపడా డబ్బుంటే అనుకున్నది సాధించడం చాలా తేలిక. కన్న కలలూ సాకారం అవుతాయి. సంపద సృష్టి, ఆర్థిక పరిపుష్ఠి గురించి ఆర్థిక ప్రణాళిక చెప్తుంది. కానీ నేడు వేసుకున్న ప్రణాళిక రేపటికి పనికిరాక పోవచ్చు.. మీ అవసరాలు మారిపోవచ్చు.. ఆదాయాలు తగ్గిపోవచ్చు.. లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే మార్పు రావచ్చు. కాబట్టి ఆర్థిక ప్రణాళికలను ఎప్పటికప్పుడు అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి. కనీసం ఏడాదికోసారైనా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చేర్పుల గురించి సమీక్ష అవసరం.
ఆదాయానికి తగ్గట్టుగా..
ఆదాయాల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలో మార్పులు అవసరం. ఆదాయం పెరిగేకొద్దీ పొదుపు, మదుపులు కూడా అందుకు తగ్గట్టే పెరగాలి. ఆదాయాలు తగ్గితే అత్యవసర ఖర్చులు తప్ప వినోద, విలాసాలకు చెక్ పెట్టాలే కానీ.. సేవింగ్స్‌ను తగ్గించరాదు.
తగిన లక్ష్యాలు
ప్రతి ఆర్థిక ప్రణాళికలోనూ ఆశయాలకు తగ్గట్టుగా లక్ష్యాలుంటాయి. వాటికి తగిన వ్యూహం ఉండాలి. అధిక ఆదాయం మరింత మదుపు వైపు దారితీయాలేగానీ, ఇంకింత వ్యయాల వైపు కాదు. పెరిగిన ఆదాయంలో అధిక భాగంతో మదుపు, భవిష్యత్తు భద్రతకు ప్రాధాన్యతనివ్వండి.
మైలురాళ్లు
పెండ్లి, పిల్లలు, వారి విద్య, సొంత ఇల్లు, కారు ఇవన్నీ జీవితంలో మైలురాళ్లే. ఇలాంటి జీవితపు మైలురాళ్ల కోసం ఆర్థిక ప్రణాళిక అవసరమే. అందుకోసం ఆయా సందర్భాలకు తగ్గట్టు ఆర్థిక ప్రణాళిక సమీక్షా అవసరమే.
సొంతింటి కోసం
భారతీయులందరికీ సొంతిల్లు ఓ కల. ఇప్పుడు మధ్యతరగతివారు లోన్ తీసుకోకుండా ఇల్లు కొనలేని పరిస్థితి. హోమ్ లోన్ కారణంగా ఆదాయంలో చాలావరకు రుణ చెల్లింపుతోనే సరిపోతుంది. కాబట్టి ఈఎంఐ పోగా, ఎంతవరకు పొదుపు చేయగలరో సమీక్షించండి.
బీమా తప్పనిసరి
కరోనా కారణంగా ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. లైఫ్‌ైస్టెల్ రోగాలూ ఎక్కువయ్యాయి. కనుక ఆరోగ్య జాగ్రత్తలతోపాటు ఆర్థిక జాగ్రత్తలూ అవసరమే. జీవిత బీమా, ఆరోగ్య బీమా రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వండి.