సిసిలీ, ఆగస్టు 23: కార్పొరేట్ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని నిలిచిన మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్(70) జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది. పెను తుఫాన్‌ను ఆయనను కబళించివేసింది. కోర్టు కేసులో గెలిచిన ఆనందంలో బ్రిటిష్ టెక్ టైకూన్ మైక్ లించ్‌తో కలిసి చేసిన విహార యాత్ర చివరకు విషాదాంతమైంది. ఆయనతోపాటు ఆయన సతీమణి జుడీ, మిత్రుడు లించ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. లించ్ కుమార్తె హన్నా(18), కేసును వాదించిన న్యాయవాది క్రిస్టఫర్ మర్విలో, ఆయన భార్య నెడా, మరో మహిళ జాడ తెలియరాలేదు. ‘బ్రిటిష్ బిల్ గేట్స్’గా పేరున్న మైక్ లించ్ మోసానికి పాల్పడినట్లు దాఖలైన కేసులో అమెరికన్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఆయన నిర్దోషి అని కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆయన తరపున జోనాథన్ బ్లూమర్ సాక్ష్యం చెప్పారు. ఈ సంతోషాన్ని అందరితో కలిసి పంచుకోవడం కోసం జోనాథన్ ఆహ్వాన మేరకు వీరంతా ఇటలీలోని సిసిలీకి విలాసవంతమైన సూపర్‌యాట్ బయేసియాన్లో దాదాపు 22 మంది ఆనందంగా గడిపారు. పోర్టిసెల్లో తీరంలో వచ్చిన పెను తుఫాన్ దెబ్బకు ఈ సూపర్‌యాట్ ఈ నెల 19న మునిగిపోయింది. దీనిలోని ఐదుగురిని మాత్రమే సహాయక బృందాలు కాపాడగలిగాయి.
ఆర్థిక కష్టాలు ఒకవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ బ్లూమర్ మాత్రం కంపెనీలను నడుపడంలో వెనుకంజవేయలేదు. ఆయన కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదట్లో 20 ఏండ్లపాటు ఆర్థర్ అండర్సన్‌తో కలిసి సంస్థను నడిపారు. ఆ తర్వాతి 1995 నుంచి 2005 మధ్యకాలంలో ప్రుడెన్షియల్ పీఎల్‌సీలో కీలక హోదాల్లో పనిచేశారు. రైట్స్ ఇష్యూ జారీ చేయడంతో వాటాదారులతో వచ్చిన విభేదాల కారణంగా ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. 2006 నుంచి 2012 మధ్యకాలంలో సెర్బెరస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎల్పీలో ఆపరేటింగ్ భాగస్వామిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కెరీర్‌ను ప్రారంభించి స్వల్పకాలంలో అగ్రస్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాతి డీడబ్ల్యూఎఫ్ గ్రూపు లిమిటెడ్, యారో గ్లోబల్ గ్రూపు లిమిటెడ్ వంటి కంపెనీల బోర్డు చైర్మన్ హోదాలో సేవలందించారు. మోర్గాన్ స్టాన్లీస్ యూరోపియన్ డివిజన్ చైర్మన్‌గా 2018 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.