
Best Mileage Bikes | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి మొగ్గు చూపుతున్నారు.. మధ్యతరగతి ఉద్యోగి అయితే బైక్‌లు, స్కూటీలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందునా ఇప్పుడు కరోనా కష్టకాలం.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. కనుక వీలైనంత మేరకు డబ్బు ఆదా చేయాలి.. ఇప్పుడు బైక్‌లు, స్కూటీలు కూడా భారీ ధరలే పలుకుతున్నాయి. దీనికి తోడు లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది. డబ్బు ఆదా చేయాలంటే తక్కువ ధరకు ఎక్కువ మైలేజీనిచ్చే బైక్‌లు, స్కూటీలను ఎంచుకుంటారు. కనీసం లీటర్ పెట్రోల్‌పై 50 కిలోమీటర్లకు తగ్గకుండా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న బైక్‌లకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో మీరు ఉన్నారా.. అయితే, ఈ కథనంపై ఓ లుక్కేయండి..!
దేశంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే మోటార్ సైకిళ్లలో బజాజ్ ఆటో ప్లాటినా100 ఒకటి. దీని ధర రూ.59,040 నుంచి మొదలవుతుంది. 102 సీసీ ఇంజిన్, 7.9 బీహెచ్పీ, 8.3 ఎన్ఎం టార్చి సామర్థ్యంతో కలిగి ఉన్న బజాజ్ ప్లాటినా లీటర్ పెట్రోల్‌పై 96 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
దేశంలోనే అతిపెద్ద మోటారు సైకిల్ కంపెనీ హీరో మోటో కార్ప్ నుంచి చౌకగా లభించే బైక్ హీరో హెచ్ఎఫ్100. లీటర్ పెట్రోల్‌పై 70 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. 100 సీసీ సామర్థ్యం గల ఈ బైక్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో రూ.51.030లకు లభిస్తుంది.
బజాజ్ ఆటో నుంచి చౌకగాగానూ, అత్యంత మైలేజీనిచ్చే ఎఫిషియంట్ బైక్స్‌లో బజాజ్ సీటీ100 ఒకటి. 100 సీసీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉండే ఈ బైక్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.53,696. దీన్ని బజాజ్ డీటీఎస్-ఐ ఇంజిన్‌తో డిజైన్ చేశారు. లీటర్ పెట్రోల్ మీద 90 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.
హీరోమోటో కార్ప్ అందిస్తున్న మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెంట్ బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. లీటర్ పెట్రోల్ మీద 70 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. 100 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ బైక్ ధర రూ.54,650 నుంచి మొదలవుతుంది.
ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హోండా మోటార్స్ ఆవిష్కరించిన మెరుగైన మైలేజీ బైక్ హోండా సీడీ100 డ్రీమ్. 109.5సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. అల్లాయ్ వీల్స్‌తో వస్తున్న ఈ బైక్ మీద గంటకు లీటర్ పెట్రోల్‌పై 74 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో దీని ధర రూ.66 వేల నుంచి ప్రారంభం అవుతుంది.