న్యూఢిల్లీ, జూలై 18: రిస్క్‌తో కూడిన స్టాక్ మార్కెట్లో ఉద్యోగుల పొదుపును మరింత మళ్లించడానికి నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. పదవీ విరమణ కోసం ఉద్యోగుల పొదుపు నిధుల్ని సమీకరించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈక్విటీల్లో చేసే పెట్టుబడుల్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) త్వరలో ఆమోదిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 29, 30 తేదీల్లో జరిగే ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.
ఈపీఎఫ్‌వో పెట్టుబడులకు ఉద్దేశించిన మొత్తం డిపాజిట్లలో ప్రస్తుతం సంస్థ 5 నుంచి 15 శాతం వరకూ ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నది. ఈ పరిమితిని 20 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ఇప్పటికే ఈపీఎఫ్‌వోకు చెందిన ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ) సిఫార్సుచేసింది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత స్కీమ్‌లో పెట్టుబడి పరిమితిని 5-15 శాతం నుంచి 5-20 శాతానికి పెంచాలంటూ ఎఫ్ఏఐసీ చేసిన సిఫార్సును ఆమోదానికై సీబీటీ ముందు ఉంచుతారు. కేంద్ర కార్మిక మంత్రి నేతృత్వంలోని సీబీటీ ఈ సిఫార్సును ఆమోదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఈక్విటీ పెట్టుబడుల్ని పెంచాలని ఎఫ్ఐఏసీ సిఫార్సు చేసిందంటూ కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సోమవారం లోక్‌సభకు ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
2015 నుంచి స్టాక్స్‌లో పెట్టుబడులు..
ఈపీఎఫ్‌వో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయడం మోదీ అధికారం చేపట్టిన మరుసటి సంవత్సరమే ప్రారంభమయ్యింది. 2015 ఆగస్టు నుంచి స్టాక్స్ సంబంధిత సాధనాలైన ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లో 5 శాతం ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 15 శాతానికి పెంచారు. ప్రభుత్వ గ్యారంటీ లేని స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ ఈక్విటీ సంబంధిత సాధనాల ద్వారా సమకూరిన పుస్తక లాభాలు 2021-22లో 16.27 శాతం, 2020-21లో 14.67 శాతం ఉన్నాయని రామేశ్వర్ లోక్‌సభకు తెలిపారు. అలాగే 2019-20లో 8.29 శాతం నష్టం వచ్చిందని వెల్లడించారు.